Omicron India: ప్రపంచంలోని పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమావేశమయ్యారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్. కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, హోం ఐసోలేషన్ వసతులు ఉండేట్టు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నిర్ధరణ అయితే ఆ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించాలన్నారు.
కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ కార్యక్రమం, మౌలిక వైద్యవసతులు.. తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని రాజేష్ భూషణ్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
నిబంధనలు పొడిగింపు..
ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. దేశంలో కరోనా కట్టడి నిబంధనలను డిసెంబరు 31వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి ఒక్కకేసు కూడా భారత్‌లో నమోదు కాలేదని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. దేశంలో కొవిడ్-19 పరిస్థితిని జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం(ఇన్సాకాగ్) పర్యవేక్షిస్తుందన్నారు.
Omicron News: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో.. కొత్త వేరియంట్ ప్రభావం ఉన్న దేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు కఠిన నిబంధనలు విధించింది కేంద్రం. ఆయా దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయాలన్న దానిపై ప్రస్తుతం సమీక్ష జరుపుతోంది.
నవంబరు 26 నాటికి యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, జింబాబ్వే, సింగపుర్, హాంకాంగ్, ఇజ్రాయెల్.. వైరస్ ప్రభావిత దేశాలుగా ఉన్నాయి.
దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తగా వెలుగుచూసిన బీ.1.1.529 వేరియంట్‌ను ఇప్పటికే ఆందోళనకర రకంగా ప్రకటించింది డబ్ల్యూహెచ్‌ఓ. దీనికి 'ఒమిక్రాన్' అని నామకరణం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఒమిక్రాన్‌లోని మ్యుటేషన్లకు రోగనిరోధకవ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం ఉందన్న డబ్ల్యూహెచ్‌ఓ.. భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా తీవ్ర పరిణామాలు తలెత్తవచ్చని చెప్పింది. వ్యాక్సినేషన్ వేగవంతం సహా ఆరోగ్య రంగ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
ఇదీ చూడండి: Omicron India: ఒమిక్రాన్ భయాలు- ఆఫ్రికా నుంచి వచ్చిన 100 మంది అదృశ్యం!