ఇద్దరి మృతికి కారణమైన భైర అనే ఓ అడవి ఏనుగును కర్ణాటక అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు మరో రెండు ఏనుగులను సైతం పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మరీ వాటిని బంధించారు.
అసలేం జరిగిందంటే?
చిక్కమగళూరు జిల్లాలో ముదిగెరె తాలుకాలోని అటవీ ప్రాంతంలో అనేక ఏనుగులు ఉంటున్నాయి. ఐదు నెలలుగా సమీప గ్రామాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. వీటిలో భైరా అనే ఏనుగు ఇద్దరి ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఈ ఘటనలపై స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. దీంతో ఆగ్రహించిన ప్రజలు స్థానిక ఎమ్మెల్యేపై దాడి చేసేందుకు ప్రయత్నిచారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఆ ఏనుగులను పట్టుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. ఆరు శిక్షణ పొందిన ఏనుగులతో స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు తీవ్రంగా కష్టపడ్డ అధికారులు చివరకు వాటిని పట్టుకున్నారు. అయితే ఏనుగు భైర మాత్రం అధికారులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుంది. దీని కోసం డ్రోన్లను వినియోగించి వెతికారు అధికారులు. చివరగా ఉరబాగే గ్రామంలో భైర ఉందన్న సమాచారం తెలుసుకుని చాకచక్యంగా దానిని పట్టుకున్నారు. క్రైయిన్ సహాయంతో బంధించారు.
ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కీలకనిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల కారణంగా బాధితులైన వారికి ఇచ్చే పరిహారాన్ని రెట్టింపు చేశారు. ప్రాణనష్టానికి రూ.7.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు, అంగవైకల్యానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు, పాక్షిక వైకల్యానికి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. క్షతగాత్రులకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు, ఆస్తి నష్టానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పరిహారం అందజేస్తామన్నారు. ప్రాణనష్టం లేక శాశ్వత వైకల్యం కలిగినప్పుడు ఇచ్చే పెన్షన్ను రూ. 2,000 నుంచి రూ.4,000కు పెంచారు.