ఛత్తీస్‌గఢ్‌లో తన లక్ష రూపాయలు విలువ చేసే సెల్‌ఫోన్ నీటిలో పడిందని ఓ ఉన్నతాధికారి రిజర్వాయర్‌ను తోడేసిన ఘటన ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. అందుకు గాను ఆ అధికారిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. తాజాగా 4,104 క్యూబిక్ మీటర్ల నీటిని వృథా చేసినందుకు ఆ అధికారి జీతం నుంచి రూ. 53,092 వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
"మే 21న మొబైల్ ఫోన్ రిజర్వాయర్‌లో పడడం వల్ల.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే డీజిల్ మోటార్ పెట్టి నీటిని తోడించారు ఫుడ్ ఇన్స్‌పెక్టర్. ఆయన సొంత ప్రయోజనాల కోసం దాదాపు 4,104 క్యూబిక్ మీటర్ల నీటిని వృథా చేశారు. దీనికి ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఒక్కొ క్యూబిక్ మీటర్ నీటికి రూ.10.50 చొప్పున రూ. 43,002 చెల్లించాలి. దీంతో పాటు అనుమతి లేకుండా నీటిని తోడినందుకు మరో 10వేల రూపాయలు జరిమానా కట్టాలి. మొత్తం 53,092 రూపాయాలు 10 రోజుల్లో డిపాజిట్ చేయాలి"
--జలవనరుల శాఖ అధికారుల నోటీసు
సరదా తీర్చిన సెల్ఫీ..
రాజేశ్ విశ్వాస్ అనే వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంకేర్ జిల్లాలో ఫుడ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల అతను స్థానికంగా ఉన్న ఖేర్‌కట్టా డ్యామ్ సందర్శనకు వచ్చిన సమయంలో సెల్ఫీ తీసుకుంటుండగా అక్కడి ఓవర్ ఫ్లో ట్యాంక్ నీటిలో తన స్మార్ట్‌ఫోన్ పడిపోయింది. లక్ష రూపాయల విలువ చేసే ఫోన్ కావడం.. అందులో అధికారిక సమాచారం ఉందని తెలపడం వల్ల దాన్ని కనిపెట్టేందుకు తొలుత స్థానిక ఈతగాళ్లను రంగంలోకి దించారు. 15 అడుగుల లోతైన నీళ్లలో వారు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.
3 రోజులు.. 4 వేల క్యూబిక్ మీటర్ల నీరు!
సెల్‌ఫోన్ నీటిలో పడిందని జలవనరుల విభాగం అధికారికి మౌఖికంగా సమాచారం ఇచ్చిన ఆ అధికారి.. రెండు భారీ మోటార్లతో నీళ్లను తోడటం ప్రారంభించారు. 3 రోజుల్లో దాదాపు 4వేల క్యూబిక్ మీటర్ల నీటిని బయటకు తోడేశారు. ఈ నీటితో వందల ఎకరాల సాగునీటి అవసరాలు తీరతాయని తెలుస్తోంది. ఒకవైపు ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతుంటే.. ఈ స్థాయిలో నీటి వృథాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన అధికారులు విశ్వాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఆ అధికారి జీతం నుంచి రూ. 53,092 వసూలుచేసే విషయమై నీరు తోడేందుకు విశ్వాస్‌కు మౌఖికంగా అనుమతి ఇచ్చిన అధికారి రామ్‌లాల్ ధివార్‌కు ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ లేఖ రాశారు.
అయినా ఆన్ కాని ఫోన్!
ఆ రిజర్వాయర్ నీరు వ్యవసాయానికి, వేసవిలో ఇతర అవసరాలకు వినియోగిస్తారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు వినియోగించే నీటిని వృథా చేసినందుకు.. దానికి విలువ కట్టి, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ జీతం నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేయకూడదని ఆ అధికారిని ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరారు. మరో వైపు ఆ ఫోన్‌ను బయటకు తీసేందుకు కొంత మేర నీళ్లను తోడేందుకే అనుమతి ఇచ్చామని, కానీ.. చాలా ఎక్కువే ఖాళీ చేశారని జలవనరుల విభాగం అధికారి ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఎట్టకేలకు ఫోన్‌ను బయటకు తీసినప్పటికీ.. అది మూడు రోజుల పాటు నీటిలో ఉండటం వల్ల పనిచేయడం లేదని తెలిసింది.