టై అండ్ డై చీరలకు పెట్టింది పేరు ఒడిశా. ఈ చేనేత విధానానికే మరో పేరు 'బంధకళ'. ఈ కళలో సువర్ణపూర్ చేనేత కళాకారులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే బంధకళ పుట్టినట్లు చెప్తారు. ఈ ఊరంతా రంగురంగుల దారాలతో తయారుచేసే కళ్లు చెదిరే డిజైన్లే దర్శనమిస్తాయి.
సువర్ణపూర్‌కు చెందిన ఓ చేనేత కళాకారుడు ఓ చీరపై భారతదేశ పటం చిత్రించాడు. చీర కొంగు, అంచులపై 28 రాష్ట్రాల పేర్లు, వాటి చిత్రపటాలు డిజైన్ చేశాడు. అంతేకాదు, అన్నదాతల ఔన్నత్యాన్ని చాటిచెప్పే 'జై జవాన్-జై కిసాన్ ' నినాదం, దేశభక్తిని తెలిపే 'ఐ లవ్ మై ఇండియా' లాంటి నినాదాలను సన్నని దారాలతో చీరపై నేశాడు. ఈ డిజైన్లన్నీ టై అండ్ డై పద్ధతిలోనే చేశాడు చేనేత కళాకారుడు ఈశ్వర్ మెహెర్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్... ఈ అద్భుతమైన కశాఖండాన్ని చూసి, ఈశ్వర్‌ను మెచ్చుకున్నారు.
"భరతమాత చిత్రపటం ఈ చీరపై అద్దాం. దేశంలోని 28 రాష్ట్రాల పేర్లు కనిపిస్తాయి. జై జవాన్- జై కిసాన్ నినాదంతో సందేశాన్ని కూడా ఈ చీర ద్వారా ఇవ్వదలచుకున్నాం. ఐ లవ్ మై ఇండియా అనే నినాదం కూడా రాశాం. ఈ చీరను నేసేందుకు నాకు నెల సమయం పట్టింది."
-ఈశ్వర్ మెహెరా, టై అండ్ డై కళాకారుడు
"శంబల్‌పూరీ చీరలకు ఒడిశావ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఈ చీరలు నేసేందుకు మహిళలూ ఆసక్తి చూపుతారు. చీరలపై సుందరమైన డిజైన్లు అద్దుతారు. సోనేపూర్‌లో, ఒడిశాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా శంబల్‌పూర్ చీరలకు మంచి ఆదరణ దక్కుతోంది. చీరతో చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే మహిళలు ఇష్టంగా కట్టుకుంటారు."
-జోగమయా మిశ్రా, సువర్ణాపూర్ వాసి
ఈ చీరల తయారీలో ఎలాంటి రసాయనాలు, యంత్రాలు వినియోగించరు. సన్నని, సున్నితమైన దారాలు, సహజ రంగులను వాడి, మగ్గాలపై చేత్తోనే నేస్తారు. శంపూర్ దారాలతో తయారు చేసే ఈ చీరలు మెత్తగా ఉండి, ధరిస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ చీరకు డిమాండ్ బాగానే ఉన్నందున... 15 నుంచి 20 వేల రూపాయలకు అమ్మాలనుకుంటున్నాడు ఈశ్వర్.
"టై అండ్ డై పద్ధతిలో చీరలు తయారుచేసే శంబల్‌పూరీ చేనేత కళాకారుల ప్రతిభ అద్భుతం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నేత కళలను గమనిస్తే.. సోనేపూర్ కళాకారులు మరింత ప్రత్యేకం. వారి ఆలోచనకు సరైన రూపం తీసుకొస్తారు ఇక్కడి కళాకారులు. గ్రాఫిక్స్ సాయం లేకుండానే సూక్ష్మమైన డిజైన్లను టై అండ్ డై పద్ధతిలోనే వస్త్రంపై ఆవిష్కరిస్తారు. ఈశ్వర్ మెహెర్ అలాంటి గొప్ప కళాకారుల్లో ఒకరు."
-ప్రద్యుమ్న సాహు, జానపద సంస్కృతి పరిశోధకుడు
ఈ ఐదు మీటర్ల పొడవైన చీరపై పొదిగిన ప్రతి చిత్రం..ఒడిశాలోని కళాకారుల నైపుణ్యాలకు అద్దం పడుతుంది. ఈ విశిష్టమైన కళకు సరైన గుర్తింపు దక్కితే... ఒడిశా కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత చాటుతుంది.
ఇదీ చదవండి: 'మీ కథ నాతో చెప్పుకోండి.. 10 రూపాయలిస్తా'!