Odisha Train Accident Death Toll : ఒడిశా రైలు ప్రమాదం మృతుల సంఖ్య 288కు చేరింది. ఈ విషయాన్ని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. ఒడిశాలోని వివిధ జిల్లా ఆస్పత్రులు, మార్చురీల నుంచి అందిన నివేదికల తర్వాత బాలేశ్వర్ కలెక్టర్ ఈ సంఖ్యను నిర్ధారించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే 205 మృత దేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించినట్లు చెప్పిన ఆయన రోడ్డు మార్గంలో మృతదేహాలు తరలించాలనుకునే వారికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైలు మార్గంలో తరలించే వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని.. రవాణా ఛార్జీలను పూర్తిగా భరిస్తామని చెప్పారు. ఇప్పటివరకు గుర్తించని 83 మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రదీప్ జెనా వివరించారు.
బాధితులకు పరిహారం!
ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 531 బాధిత కుటుంబాలకు పరిహారం అందించినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే CPRO ఆదిత్య కుమార్ తెలిపారు. మొత్తం రూ. 15 కోట్ల 6 లక్షల మేర పరిహారాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. పరిహారం అందని కుటుంబాలు కటక్, మిడ్నాపూర్, భువనేశ్వర్, బాలేశ్వర్‌లోని సహాయక కేంద్రాలను సంప్రందించాలని ఆదిత్య కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 288 మంది మృతి చెందగా 1,200 మందికి పైగా గాయపడ్డారు.
రైల్వే మంత్రి సమావేశాలు..
ఒడిశా రైలు దుర్ఘటన నేపథ్యంలో వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఇప్పటివరకు ఒడిశాలోని ఘటనాస్థలిలో రెస్క్యూ, పునురుద్ధరణ పనులు సమీక్షించిన మంత్రి దిల్లీ చేరుకున్నారు. మంగళవారం రైల్వే బోర్డు సీనియర్ అధికారులను కలిశారు వైష్ణవ్. అనంతరం జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లు (GM), డివిజనల్ రైల్వే మేనేజర్‌లతో సమావేశమయ్యారు. రైల్వే బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో రైల్వే నెట్‌వర్క్‌ను పూర్తిగా ట్యాంపర్ ఫ్రూఫ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదం ఇలా జరిగింది..
Train Accident Odisha : శుక్రవారం.. బహానగా రైల్వే స్టేషన్లో లూప్ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలను ఢీకొట్టింది. ఘటనలో మొత్తం 288 మంది మృతి చెందారు. మరో 1,200 మందికిపైగా గాయపడ్డారు.