Odisha Road Accident Today : ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8మంది మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కెంధూఝర్లో ఆగి ఉన్న ట్రక్కును ఓ వ్యాన్ ఢీకొట్టడం వల్ల శుక్రవారం తెల్లవారుజామున జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ఘటగావ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గంజాంలోని దిగపహండి నుంచి కెంధూఝర్ జిల్లాలోని ఘటగావ్లోని తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
ఆగి ఉన్న ట్రక్కును వ్యాన్ ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. వ్యాన్‌లో 20మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులందరూ గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. తారిణి ఆలయానికి 3కి.మీ దూరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
పికప్ వ్యాన్-ట్రక్కు ఢీ
తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్, ట్రక్కు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. వళపాడి వద్ద గురువారం జరిగిందీ ప్రమాదం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చెన్నై నుంచి వళపాడికి వస్తున్న పికప్ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది. అప్పుడు ట్రక్కులో ఉన్న విల్లుపురానికి చెందిన ఎం ప్రవీణ్ కుమార్ (27), వెల్లూర్‌కు చెందిన సుదర్శన్ (40), ప్రకాష్ (52) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సేలం-చెన్నై బైపాస్ రోడ్డుపై జరిగిందీ దుర్ఘటన. రోడ్డు ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా దెబ్బతింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు.
ఇద్దరు మృతి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. బైక్‌ను ఢీకొట్టింది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కులదీప్ (22), అతని సోదరి దీప(24)గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంపై కోపోద్రిక్తులైన స్థానికులు రెండు గంటలపాటు దిల్లీ-దెహ్రాదూన్ జాతీయ రహదారిని దిగ్భందించి నిరసన తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇలా జరగడానికి అతివేగమే కారణమని చెప్పారు.
HIV పాజిటివ్ వ్యక్తులతో కాఫీ షాప్- దేశంలోనే తొలిసారి, ఎక్కడో తెలుసా?
పల్లెటూరి మేడమ్ ఇంగ్లిష్ పాఠాలు- యూట్యూబ్ ద్వారా నెలకు రూ.లక్షల్లో ఆదాయం!