ఒడిశాలోని కటక్‌లో అత్తాఘర్ ఫారెస్ట్ డివిజనల్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న సాస్మితాలెంకా ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి 'ఆసియా ఎన్విరాన్మెంటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్' అవార్డుకు ఎంపికయ్యారు. అరుదైన పంగోలిన్ జంతువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. 'జెండర్ లీడర్‌షిప్ అండ్ ఇంపాక్ట్' కేటగిరీ కింద ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు.
అక్రమార్కులపై ఉక్కుపాదం..
ఒడిశాలో పెద్దఎత్తున జరిగే 'పంగోలిన్ల' అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాక.. వాటి గురించి స్థానికుల్లో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టిన సాస్మితా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. అంతర్జాతీయ స్మగ్లింగ్‌కు పేరొందిన అత్తాఘర్, కూన్‌పున్నీ ప్రాంతాల్లోని ముఠాలపై ఆమె ఉక్కుపాదం మోపారు.
మా ఆపరేషన్‌లో చైనా, వియత్నాం, మయన్మార్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు అక్రమంగా తరలిస్తున్న ముఠాలను పట్టుకున్నాం. 28మంది పంగోలిన్ స్మగ్లర్లను అరెస్టు చేసాము. ఈ అవార్డు నా పనికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నా.. చాలా సంతోషంగా ఉంది. పంగోలిన్లను పూర్తిస్థాయిలో కాపాడేంతవరకు నా పని ఆగిపోదని కచ్చితంగా చెప్పగలను.
- సాస్మిత లెంకా, డిప్యూటీ ఫారెస్టు కన్జర్వేటర్, కటక్.
రివార్డ్‌తో సమాచారం..
పంగోలిన్ల ముఠా గుట్టును ఛేదించే క్రమంలో అనుమానితుల సమాచారమిచ్చిన వారికి రూ.10వేల రివార్డ్ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి మంచి స్పందన వచ్చింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా నేరస్థులపై చర్యలు తీసుకున్నామన్నట్టు 'లంకా' వివరించారు. ఈ ఆపరేషన్‌లో మూడు పంగోలిన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్థానికుల్లో చాలామందికి పంగోలిన్లపై సరైన అవగాహన లేదని 'లెంకా' అంటారు. ఈ అరుదైన జంతువు పరిరక్షణకు తీసుకున్న కఠిన చర్యలు ప్రజల మనస్తత్వాన్ని మార్చేందుకు దోహదపడ్డాయని ఆమె తెలిపారు.
ఇవీ చదవండి: మూగజీవాల ఆకలి తీర్చే 'రోటీ వ్యాన్'