రిక్షా కార్మికుడి నిస్వార్థ సేవలను మదిలో పదిలపర్చుకున్న ఆ వృద్ధురాలు తన ఉదారతను చాటుకున్నారు. రూ.కోటికిపైగా విలువైన ఆస్తులను అతడికి ధారాదత్తం చేశారు. తన భర్త, కూతురు ఉన్నప్పుడు పట్టించుకోని బంధుగణం ఒక్కసారిగా ఇప్పుడు వచ్చి అండగా ఉంటామంటూ నమ్మబలికినప్పటికీ వృద్ధురాలు విశ్వసించలేదు. ఆస్తి కోసం ఆసక్తి చూపుతున్నారని భావించారు.
భర్త, కూతురును కోల్పోయి...
ఒడిశా రాష్ట్రం కటక్ సమీపంలోని సంబల్‌పుర్‌కు చెందిన మినతి పట్నాయక్ (63) భర్తతో కలసి కటక్‌లోని సుతాహత్ క్రిస్టియన్ సాహిలో నివసిస్తున్నారు. వారి ఏకైక కుమార్తెకు పెళ్లి చేసి సంతోషంగా గడపాలని దంపతులు భావించారు. పెళ్లి సామగ్రిని సిద్ధం చేశారు. అంతలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురై 2020 జులైలో చనిపోయారు. 2021లో ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమార్తెను కూడా వృద్ధురాలు కోల్పోయారు. అప్పటివరకు పట్టించుకోని అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తి కోసం ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. సందిగ్ధానికి తావు లేకుండా తనకున్న రూ.కోటి విలువైన మూడంతస్తుల భవనం, ఇతర సామగ్రిని రిక్షా కార్మికుడు బుడ సామల్‌కు ధారాదత్తం చేస్తూ వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించారు.
సామల్ కుటుంబం 25 ఏళ్లుగా తమకు తోడుగా ఉంటోందని, తన కుమార్తెను అతడు పాఠశాలకు తీసుకెళ్లేవాడని వృద్ధురాలు గుర్తు చేసుకున్నారు. మందులు, కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చేవాడని.. తన భర్త అనారోగ్యం పాలైనప్పుడు ఎంతో సాయం చేశాడని వివరించారు. రక్తసంబంధం లేకున్నా తమకు చేసిన సేవలకు బహుమతిగా అతడి కుటుంబానికి మంచి చేయాలనిపించిందని పేర్కొన్నారు. 4నెలల నుంచి సామల్ కుటుంబం తనతో ఉంటోందని, సరదాగా గడిచిపోతోందని, చివరివరకు ఆ కుటుంబంతోనే కలసి జీవిస్తానని ఆమె చెబుతున్నారు.
ఇవీ చూడండి: