ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ యాంత్రికంగా సాగే ఉద్యోగాలు చేయాలనుకోలేదు ఆ కుర్రాడు. ఏదైనా ప్రత్యేకంగా, వినూత్నంగా చేయాలనుకున్నాడు. ఆ ఆసక్తితోనే డిజిటల్ మార్కెటింగ్‌లోకి దిగాడు. కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ యువకుడే ఒడిశాలోని చంద్రాపుర్కు చెందిన చందన్ ప్రసాద్ సాహూ. బ్లాగ్లు రాయడం ప్రారంభించిన కొద్ది కాలంలోనే మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. దేశంలోని ప్రముఖ బ్లాగర్ల నుంచి స్ఫూర్తి పొంది.. అదే రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వివిధ సంస్థల నుంచి అవార్డులు అందుకున్నాడు.
"ప్రస్తుతం ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇతరులపై ఆధారపడి బతకడం పెరిగిపోతోంది. ఏదైనా అంశంపై పట్టు ఉంటే.. అది ఇతరులకు నేర్పించవచ్చు. బ్లాగింగ్ ద్వారా ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించొచ్చు. అలాంటి పనే నేనూ చేస్తున్నాను. నా చదువు కొనసాగిస్తూనే ఈ దిశగా దృష్టి పెట్టాను."
- చందన్ ప్రసాద్ సాహూ, బ్లాగర్
నెలకు రూ.లక్ష పైనే..
చందన్.. బ్లాగింగ్ ద్వారా నెలకు లక్ష రూపాయలకు పైగానే సంపాదిస్తున్నాడు. 2016లో హిందీమీ డాట్ నెట్ పేరుతో ఓ వెబ్సైట్ ప్రారంభించాడు. వివిధ సబ్జెక్టుల్లో వినియోగదారుల సందేహాలు నివృత్తి చేయడం సహా.. వివిధ అంశాలను సరళమైన భాషలో అర్థమయ్యే రీతిలో రాస్తాడు. చందన్ పెట్టే అన్ని పోస్టులనూ లక్షలాది మంది వీక్షిస్తున్నారు. తన స్నేహితులకూ ఉపాధి కల్పిస్తున్నాడు.
"యువతీయువకులే కాదు.. ఎవరైనా బ్లాగర్‌గా మారవచ్చు. రైతులైనా, సైకిల్ మెకానిక్ అయినా, రక్షణ రంగంలో ఉద్యోగులైనా.. ఎవరైనా బ్లాగింగ్ చేయవచ్చు. ఏదైనా అంశంపై పట్టు, కొంత జ్ఞానం ఉంటే చాలు. ఓ జర్నలిస్టు అనుకోండి.. జర్నలిజం అంటే ఏంటో తెలియని వాళ్లకి ఇంట్లో కూర్చునే వివరించొచ్చు. ఒక్కరికే కాదు.. చాలామందికి చెప్పొచ్చు. బ్లాగులు రాసి, డబ్బు కూడా సంపాదించవచ్చు."
- చందన్ ప్రసాద్ సాహూ, బ్లాగర్
ఇదీ చదవండి: మలివయసులోనూ పెన్నూ, పేపరు చేతపట్టి..
తానెంటో నిరూపించుకుని..
తల్లిదండ్రులందరూ తమ పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటారు. భర్త మరణం తర్వాత.. ఆ స్థానంలోకి చందన్ వెళ్లాలని ఆ యువకుడి తల్లి కోరుకుంది. కానీ.. అందుకు నిరాకరించిన చందన్.. మొత్తానికి తానేంటో నిరూపించుకున్నాడు. చందన్ తల్లి, అతని స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
"చదువు పూర్తైన తర్వాత మా అబ్బాయి ప్రభుత్వోద్యోగం సాధించాలని అనుకున్నా. కంప్యూటర్ సైన్స్‌లో పీజీ చేశాడు చందన్. తర్వాత ఓ ఏడాది సమయం అడిగాడు. తర్వాత విజయం సాధిస్తానో లేదో చూడమన్నాడు. ఆ తర్వాత డిజిటల్ మీడియా రంగంలోకి దిగాడు. విజయవంతంగా ఎదిగాడు. మరెంతో మందికి ఆదర్శంగా నిలిచాడు."
- ప్రమోదినీ సాహూ, చందన్ తల్లి
"ఈ సబ్జెక్టులో మాకు ఏమీ తెలీదు. బ్లాగింగ్ ప్రారంభించిన తర్వాత... చందన్ సరైన పని చేస్తున్నాడని మాకనిపించింది."
- జ్ఞాన్ రంజన్ బిసీ, చందన్ స్నేహితుడు
ప్రతిభకు ఆదర్శంగా..
చంద్రాపుర్ లాంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇప్పటికీ సరిగా అందుబాటులో లేని నేపథ్యంలోనూ.. ఆ ప్రాంతానికి చెందిన చందన్.. ప్రతిభకు నిదర్శంగా నిలుస్తున్నాడు. ఒడిశాలో బ్లాగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇదీ చదవండి: కేరళ పోరులో 26ఏళ్ల అరిత ఎంతో ప్రత్యేకం!