హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్న కారణంతో 85ఏళ్ల వృద్ధుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో సేలం జిల్లాలో శనివారం జరిగింది. డీఎమ్‌కే పార్టీ కార్యకర్త తంగవేల్.. కేంద్ర ప్రభుత్వం హిందీని దక్షిణాదిపై బలవంతంగా రుద్దుతోందని ఆరోపించాడు. దీనిపై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ డీఎమ్‌కే పార్టీ కార్యాలయం ఎదుట బ్యానర్లు ప్రదర్శించాడు. "కేంద్ర ప్రభుత్వం మాకు హిందీ వద్దు. మా మాతృభాష తమిళం. హిందీ భాష రుద్దడం విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. హిందీని వదిలించుకోండి" అని బ్యానర్‌పై రాసి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటికున్నాడు. తీవ్రంగా గాయపడిన తంగవేల్.. అక్కడికక్కడే మృతిచెందాడు.
హిందీకి వ్యతిరేకంగా తీర్మానం..
హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలోనే తమిళనాడు అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో.. తమిళంతో సహా మిగతా రాష్ట్ర భాషలకు.. ఆ భాషలు మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా సిఫార్సులను అమలు చేయెద్దు' అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రపతికి సమర్పించిన అధికార భాషా పార్లమెంటరీ కమిటీ నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.
పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు..
సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల్లో హిందీని తప్పనిసరి చేయాలంటూ అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయాలతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలలో హిందీ బోధనా మాధ్యమంగా ఉండాలని సిఫార్సు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీని, మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషను అమలు చేయాలని, అలాగే ఆంగ్లాన్ని ఆప్షన్‌గా చేయాలని పేర్కొంది. ఆ నివేదిక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు సెప్టెంబర్‌లో చేరింది. అయితే రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషలను సమానంగా చూడాలని కోరుతూ అక్టోబర్ 16న ఎమ్కే స్టాలిన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఇవీ చదవండి : లోన్ ఎగ్గొట్టేందుకు భార్య హత్య.. మతిస్థిమితం లేని బాలికపై మైనర్ రేప్
ఎలుకకు రాయి కట్టి కాలువలో పడేసి హత్య! శవపరీక్ష కోసం జంతుప్రేమికుల డిమాండ్