ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డుదారులు ఇకపై భారత్లో తబ్లిగీ కార్యక్రమాలు, మీడియా సమావేశాల్లో పాల్గొనాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చిలో లాక్డౌన్ సమయంలో దాదాపు 2,500 మంది తబ్లిగీ జమాత్ సభ్యులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రార్థనల్లో పాల్గొన్న నేపథ్యంలో ఈమేరకు నిబంధనలు సవరించింది.
కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం..
- స్వదేశీ విమాన ప్రయాణ ధరలు, జాతీయ పార్కుల సందర్శన, జాతీయ మ్యూజియంల సందర్శనల్లో.. భారత పౌరులకు వర్తించే ధరలే ఓసీఐ కార్డుదారులకు ఉంటాయి.
- ఓసీఐ కార్డుదారులు.. ఏ పనిమీదనైనా భారత్కు ఎన్నిసార్లు అయినా రావొచ్చు. కానీ తబ్లిగీ, మీడియా, పరిశోధన, మిషనరీ, పర్వతారోహణం వంటి కార్యకలాపాలు భారత్లో నిర్వహించాలంటే మాత్రం విదేశీ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం(ఎఫ్ఆర్ఆర్ఓ) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
- భారత్లో ఉన్న విదేశీ విద్యాసంస్థల్లో ఇంటర్న్షిప్ చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా కేంద్రం ప్రత్యేక అనుమతి ఉండాలి.
- భారత్లోని నిషేధిత, వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించాలన్నా కచ్చితంగా కేంద్రం అనుమతి తీసుకోవాలి.
- ఓసీఐ కార్డుదారులు ఎంత కాలమైనా భారత్లో ఉండొచ్చు. కానీ ఒకవేళ శాశ్వత చిరునామా మార్చినా, ఉద్యోగం మార్చినా విదేశీ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం(ఎఫ్ఆర్ఆర్ఓ)కు సమాచారం ఇవ్వాలి.
- వ్యవసాయేత భూముల క్రయవిక్రయాల్లోనూ భారత పౌరులకు ఉన్న హక్కులే ఓసీఐ కార్డుదారులకు ఉంటాయి.
ఓసీఐ కార్డుదారులు అంటే.. విదేశీ పాస్పోర్టు కలిగిన భారత సంతతి వ్యక్తి. ఓసీఐ కార్డుదారులు భారత పౌరులు కాదు.
ఇదీ చదవండి : 'కరోనా కాలంలో 150 దేశాలకు భారత ఔషధాలు'