శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇక నుంచి బాటిళ్లలో సరఫరా చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ బాటిళ్లలో నీటిని అందించాలని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ ఔషధ నీరు బాటిళ్లలో కావాలనుకుంటే రూ.200ను ముందస్తుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వీరికి పంబా బేస్ క్యాంప్ దగ్గర ఉండే ఆంజనేయ ఆడిటోరియం వద్ద ఔషధ నీటిని అందిస్తారు. బాటిల్ ఇచ్చేసిన తర్వాత డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లిస్తారు.
స్టీల్ బాటిళ్లతో పాటు పేపర్ గ్లాసుల్లోనూ ఈ ఔషధ నీటిని అందజేయాలని దేవస్థాన బోర్డు నిర్ణయం తీసుకుంది. పంబా, చరల్మేడు, జ్యోతినగర్, మలికప్పురం పాయింట్ల వద్ద ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏంటీ ఔషధ నీరు?
యాత్రికులు ఎక్కువగా వచ్చే సమయాల్లో అయ్యప్ప భక్తులకు ఔషధాలు కలిపిన నీటిని ఏటా అందిస్తారు. ఎండు అల్లం, వెటివర్, పతంగ కట్ట వంటి ఆయుర్వేద మూలికలతో నీటిని వేడి చేసి దీన్ని తయారు చేస్తారు. పంపిణీ కేంద్రాల్లోనే ఈ నీటిని తయారు చేసి భక్తులకు ఇస్తారు.