ఏటీఎం దొంగతనం అంటే.. మెషిన్‌ను పగులగొట్టడమో.. లేదంటే మెషిన్నే ఎత్తుకెళ్లిన ఘటనలు మనం చూశాం. కానీ ఈ సారి మాయగాళ్లు మరీ స్మార్ట్‌గా ఆలోచించారు. క్యాష్ డిపాజిట్ మెషిన్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఏటీఎం మెషిన్లోని చిన్న లూప్ హోల్‌ను ఆసరాగా చేసుకుని రూ. లక్షలు దండుకున్నారు. సుమారు రూ.48 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది.
20 సెకన్లే కీలకం..
క్యాష్ డిపాజిట్ మెషిన్లలో డిపాజిట్‌తో పాటు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎస్బీఐ మెషిన్లను జపాన్ ఓకేఐ కంపెనీ తయారు చేసింది. దీనిలో విత్‌డ్రా చేసుకున్నప్పుడు 20 సెకన్లు కీలకమైన సమయంగా పరిగణిస్తారు. డబ్బులు బయటకు రాగానే 20 సెకన్లలోగా తీసుకోవాలి. లేదంటే ఆ నోట్లను మెషిన్.. లోపలికి తీసుకుంటుంది. వెంటనే మూత పడిపోతుంది. డబ్బులు తీసుకోలేదని అక్కడ ఉన్న సెన్సార్లు గ్రహించి సమాచారం పంపిస్తాయి. అకౌంట్లో బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. డబ్బులు డ్రా చేసుకునేప్పుడు.. ఏటీఎం మూతపడిపోకుండా చేతితో ఆపితే డబ్బులు తీసుకోలేదని సెన్సార్లు గ్రహిస్తాయి. దీన్నే తమ ఆయుధంగా వాడుకున్నారు కేటుగాళ్లు.
ఆ చిన్న లొసుగుతో..
ఎస్బీఐ ఏటీఎం మెషిన్లోని చిన్న లొసుగును ఆసరాగా చేసుకుని హరిణాయాకు చెందిన మూఠాలు దొంగతనాలకు పాల్పడ్డాయి. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని మూతపడిపోకుండా చేతితో ఆపే టెక్నిక్‌ను గ్రహించారు కేటుగాళ్లు. దీంతో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నా తీసుకోలేదని సెన్సార్లు గ్రహించాయి. అకౌంట్లలో బ్యాలెన్స్ తప్పుగా చూపించగా.. బ్యాంకు అధికారులు సీసీ టీవీలను గమనించారు. దీంతో మోసం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలో జూన్ 15 నుంచి 18 మధ్య తమ ఎస్బీఐ ఏటీఎంల్లో రూ.48 లక్షలు డబ్బును మాయం చేశారని.. దీనికి సంబంధించి 14 కేసులు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీ ఆధారంగా నిందితులు హరియాణాకు చెందిన ముఠాలుగా గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా హరియాణాలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఒక నిందితుడు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: రోడ్ రోలర్‌ను కొట్టేసి.. కిలోల లెక్కన అమ్మేసి..