Nota Votes In Assembly Elections 2023 : మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతం కన్నా తక్కువ ఓటర్లు నోటాకు ఓటేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 1.29 శాతం మంది నోటా ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను వెల్లడించింది.
ఐదు రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 77.15 శాతం పోలింగ్ నమోదవ్వగా.. అందులో 0.99 శాతం మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో 76.3 శాతం మంది ఓటేయగా.. అందులో 1.29 శాతం మంది నోటా వైపు మొగ్గు చూపారు. తెలంగాణలో 71.14శాతం ఓట్లు పోలవ్వగా.. 0.74 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. రాజస్థాన్‌లో 0.96 శాతం మంది ఓటర్లు నోటా ఆప్షన్‌ను వినియోగించుకున్నారు.
అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు ఏళ్లుగా డిమాండ్ చేసిన నేపథ్యంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు వివరించింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినప్పటికీ పలు సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు 2013 సెప్టెంబరు 27న తీర్పు వెలువరించింది. 2014లో ఎన్నికల సంఘం 'నోటా'ను ప్రవేశపెట్టింది.
వాస్తవానికి అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం చాలా ఏళ్ల క్రితం కల్పించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49(ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్లి దీని కోసం 17-ఎ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్దతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడం వల్ల నోటాను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది.
12 రాష్ట్రాల్లో బీజేపీ- 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్- పొలిటికల్ మ్యాప్‌ను మార్చేసిన సెమీఫైనల్!
'కౌన్ బనేగా సీఎం?'- మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరంటే?