భర్త కోసం టీ చేసేందుకు నిరాకరించడాన్ని... భార్యపై దాడికి కారణంగా అంగీకరించలేమని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. టీ చేయలేదని ఆవేశంలో భార్యపై దాడి చేసినందుకు భర్తను దోషిగా తేల్చిన కోర్టు.. భార్య వస్తువు కాదని పేర్కొంది.
"పెళ్లి అనేది ఆదర్శం, సమానత్వంతో కూడిన భాగస్వామ్యం. అయితే మహిళ.. పురుషుల ఆస్తి అనే ఆలోచనలో సమాజం ఇప్పటికీ ఉంది. పురుషుడు తన భార్యను వస్తువుగానే భావిస్తున్నాడు" అని జస్టిస్ రేవతి మోహితే దేరే అభిప్రాయపడ్డారు.
ఇదీ జరిగింది
మహారాష్ట్ర సోలాపుర్ జిల్లాలోని పందర్పుర్ ప్రాంతానికి చెందిన సంతోష్ అక్తర్(35).. తన భార్య టీ తయారు చేయడానికి నిరాకరించిందని ఆవేశంలో ఓ ఆయుధంతో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా.. వారం రోజులు చికిత్స పొందుతూ అక్కడే మరణించింది. ఈ ఘటన 2013లో జరిగింది. అంతకుముందు నుంచే వారి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలిసింది.
ఈ కేసుకు సంబంధించి 2016లో హత్యాయత్నం నేరారోపణ కింద అక్తర్‌ను దోషిగా తేల్చిన స్థానిక కోర్టు.. 10 ఏళ్లు జైలుశిక్ష విధించింది. దీనిపై అక్తర్.. హైకోర్టులో సవాలు చేశాడు. అయితే అక్తర్ కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని.. అతని పిటిషన్‌ను తిరస్కరించింది హైకోర్టు.
ఇదీ చూడండి: 'మహిళ ఆస్తిపై తండ్రి వారసులకూ హక్కు'