గణతంత్ర దినోత్సవాన దిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసలో తన ప్రమేయం లేదని గ్యాంగ్స్టర్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన లక్బీర్ సింగ్(లఖా సిధానా) తెలిపాడు. ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న ఘటనల్లో అతని పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రాగా.. వాటిని సిధానా ఖండించాడు. ఏ విషయం విచారణలో తేలుతుందన్నాడు.
"మేం ఔటర్ రింగ్ రోడ్డు వైపు 20మంది రైతు నేతలతో కలిసి శాంతియుతంగా ప్రదర్శన చేశాం. ఎర్రకోట వైపునకు వెళ్లాలన్న ఎజండా మాకెప్పుడూ లేదు" అని పీటీఐకి తెలిపాడు.
అలాగే ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న ఘటనలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్ధూతో కలిసి సోమవారం రాత్రి తాను ఒక వేదికపై ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను కూడా సిధానా ఖండించాడు. పంజాబ్లోని బఠిండాకు చెందిన సిధానా.. సింఘు సరిహద్దుల్లో నవంబరు 26 నుంచి ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. అతనిపై గతంలో పదుల సంఖ్యలో కేసులుండగా పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు.