మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్. అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు కేసు, హిరేన్ మృతి తదితర విషయాలపై దర్యాప్తు కొనసాగుతుందని, దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
హోం మంత్రిపై ముంబయి మాజీ సీపీ పరమ్‌బీర్ సింగ్ ఆరోపణల నేపథ్యంలో.. దిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో పార్టీ సీనియర్లు ఆదివారం సమావేశమయ్యారు. ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, సుప్రియా సూలే సహా పలువురు హాజరయ్యారు. తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు.
భేటీ అనంతరం మాట్లాడిన పాటిల్.. హోం మంత్రి రాజీనామా అంశం చర్చకు రాలేదని వెల్లడించారు.
''అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా అన్న ప్రశ్నే లేదు. అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు, మన్సుఖ్ హిరేన్ మృతి కేసులో ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్) దర్యాప్తు చేస్తోంది. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని విశ్వసిస్తున్నాం.''
- జయంత్ పాటిల్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు
దర్యాప్తు చివరికి వచ్చిందని, ఆదివారం ఇద్దరిని పట్టుకున్నట్లు పేర్కొన్న పాటిల్.. కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విచారణ పూర్తి కాకముందే అనిల్ రాజీనామాను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'హిరేన్ మృతి కేసు కథ ముగిసింది!'
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు విచారణ జరుగుతుండగానే.. పరమ్‌బీర్ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. ఆ స్థానంలో హేమంత్ నగ్రాలేను నియమించింది.
ఆ తర్వాతే అనిల్ దేశ్‌ముఖ్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు పరమ్‌బీర్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు.. పరమ్ రాసిన లేఖ దుమారానికి దారి తీసింది. నెలకు రూ.100 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు.. పోలీసు అధికారి సచిన్ వాజేతో హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేస్తోంది.
ఇదీ చూడండి: ''మహా' సర్కార్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు'