దిల్లీలోని ఆసుపత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయటంలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర ప్రభుత్వం.. దిల్లీ హైకోర్టుకు తెలిపింది. పీఎం కేర్స్ నిధి నుంచి ఎనిమిది ఆక్సిజన్ ప్లాంట్లను దిల్లీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది.
ఏప్రిల్ 22 నుంచి పరిశ్రమలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయటం నిషేధిస్తామని పేర్కొంది. కొన్ని అత్యవసర పరిశ్రమలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 1,390 వెంటిలేటర్లను అందించామని వివరించింది.
అంతకుముందు.. దిల్లీలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్-19 రోగులకు సరిపడా ఆక్సిజన్‌ను సరఫరాపై కేంద్రాన్ని దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్ కోసం పరిశ్రమలు వేచిచూడవచ్చని.. కానీ కొవిడ్ రోగులు కాదని, ప్రజల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలోని కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.
వ్యాక్సిన్ల వృథాపై అసంతృప్తి
వ్యాక్సిన్ల వృథాపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రణాళికా లోపంతోనే ఇప్పటివరకు 44 లక్షల డోసులు వృథా అయ్యాయని పేర్కొంది. టీకాల పంపిణీలో వివక్ష తగదని, ఇకనైనా టీకా వృథాను అరికట్టే చర్యలు చేపట్టాలని సూచించింది.
ఇదీ చదవండి : ముంబయిలో 2,200 రెమ్‌డెసివిర్ వయల్స్ సీజ్