కరోనా రెండో దశ ముప్పు ఇంకా వీడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించకపోతే మరోసారి ప్రమాదం తప్పదని హెచ్చరించింది. పర్యటక ప్రాంతాల్లో ప్రజలు నిబంధనలను పాటించకుండా సంచరించడం ఆందోళన చెందాల్సిన అంశమని పేర్కొంది. వేర్వేరు దేశాలను కలవరపెడుతున్న లామ్డా వేరియంట్‌ను ఇప్పటివరకు భారత్‌లో గుర్తించలేదని చెప్పింది.
"లామ్డా వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ వేరియంట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటివరకైతే భారత్‌లో ఈ వేరియంట్ వెలుగు చూసిందనడానికి ఆధారాలు లేవు. "
-వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు
ఆ రెండు రాష్ట్రాల్లోనే..
దేశంలో గతవారం నమోదైన మొత్తం కేసుల్లో సగం కంటే ఎక్కువ మహారాష్ట్ర(21శాతం), కేరళ(32శాతం)లోనే నమోదయ్యాయని వీకే పాల్ తెలిపారు. జులై 8న 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 66 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదైందని చెప్పారు.
15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 90 జిల్లాల నుంచి 80 శాతం కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కరోనా కట్టడికి మరింత పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియచెబుతోంది. జాగ్రత్తలు పాటించడం మరవకూడదు. పర్యటక ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, మాస్కు ధరించకుండా ప్రజలు సంచరించడం.. ఆందోళనకు దారి తీస్తోంది.
- వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు
అయితే.. దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వీకే పాల్ చెప్పారు. కొత్త కేసుల్లో సగటున 8 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు తెలిపారు. రికవరీల సంఖ్య కూడా పెరుగుతోందన్న ఆయన.. శుక్రవారం రికవరీ రేటు 97.2 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గర్భిణులు టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
ఇదీ చూడండి: Kappa Variant: ఆ రాష్ట్రంలో కప్పా వేరియంట్ కలకలం!
ఇదీ చూడండి: కేరళలో జికా వైరస్ విజృంభణ- మరో ముప్పుగా మారేనా?