ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ.. కొత్త రకాలు మాత్రం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌లోనూ బయటపడుతోన్న కొత్త రకం కరోనా వైరస్‌లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా B.1.1.28.2 కొత్త వేరియంట్‌ను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు గుర్తించారు. వీటిని బ్రిటన్, బ్రెజిల్ నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాల నుంచి వేరుచేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ వేరియంట్ వల్ల కలిగే లక్షణాలు కాస్త తీవ్రంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వైరస్‌లో మార్పులకు సంబంధించి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేపడుతోన్న అధ్యయనంలో కొత్త రకం వేరియంట్ లక్షణాలను గుర్తించారు. ముఖ్యంగా B.1.1.28.2 కారణంగా శరీర బరువు కోల్పోవడం, శ్వాసకోశంలో వైరస్ గణనీయంగా పెరగడం, ఊపిరితిత్తులు దెబ్బతినడానికి కారణమవుతున్నట్లు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా ఎలుకలపై జరిపిన అధ్యయనంలో వాటి ఊపిరితిత్తుల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించిందని ఎన్ఐవీ నిపుణులు కనుగొన్నారు.
'కొవాగ్జిన్ పనిచేస్తుంది'
కరోనా వైరస్‌లో చోటుచేసుకునే మార్పులకు (మ్యుటేషన్ల) సంబంధించి దేశంలో ఉన్న పది కేంద్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 30వేల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టింది. అయితే, ఇలా దేశంలో వెలుగుచూస్తోన్న కరోనా కొత్తరకాలపై వ్యాక్సిన్‌లు పనిచేస్తాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గుర్తించిన ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో కొవాగ్జిన్ టీకా సమర్థవంతంగానే పనిచేసే అవకాశం ఉందని ఎన్ఐవీ పరిశోధకులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, కొన్ని ప్రాంతాల్లో వైరస్ తీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా రకాలతో మున్ముందు ప్రమాదం పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. వీటిని నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమమని అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా 80శాతం మందికి వ్యాక్సిన్ అందించడం ద్వారా ఇతర దేశాల నుంచి వస్తోన్న కొత్త రకాల ముప్పు నుంచి బయటపడవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : పిల్లలపై కరోనా ప్రభావం ఉండకపోవచ్చు: గులేరియా