చిన్న వయస్సులోనే కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు నిషిత్ ప్రామాణిక్. ఆయనకు హోం, యువజన, క్రీడాశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. గల్లీ నుంచి దిల్లీ వరకు నిషిత్ రాజకీయ ప్రస్థానం ఇలా..
బంగాల్లోని దిన్‌హతాలో జనవరి 17, 1986లో జన్మించారు నిషిత్. బాలకూర జూనియర్ బేసిక్ స్కూల్ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచ్‌లర్స్ పట్టా పొందారాయన. ప్రారంభంలో ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేసి.. ఆపై తృణమూల్ కాంగ్రెస్‌లో యూత్ లీడర్‌గా సేవలందించారు. అనంతరం 2019లో భాజపాలో చేరారు. బంగాల్లోని కోచ్ బిహార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు.
టీఎంసీపై స్వత్రంత్రులను దింపి..
అది 2018.. బంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు. అధికార పార్టీని ఢీకొట్టి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో నిషిత్ తనదైన రాజకీయ వ్యూహాలతో రంగంలోకి దిగాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులను టీఎంసీకి పోటీగా నిలిపి, వారిలో అత్యధిక మంది విజయం సాధించేలా చేశాడు.
2019లో భాజపాలోకి ఎంట్రీ
2019 ఫిబ్రవరిలో కాషాయతీర్థం పుచ్చుకున్న నిషిత్ ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నాడు. కోచ్ బిహార్‌లో టీఎంసీకి ప్రాబల్యం ఎక్కువ. అయినా కూడా లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తా చాటారు నిషిత్. టీఎంసీ అభ్యర్థి చంద్రా అధికారిపై సుమారు 54వేల ఓట్ల తేడాతో విజయ ఢంకా మోగించారు. అయితే, ఈ ఏడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన నిషిత్ దిన్హతా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజాగా కేంద్ర మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు.
ఇదీ చూడండి: Cabinet expansion:మంత్రివర్గ విస్తరణలో యూపీ, గుజరాత్‌కే అగ్రాసనం