Parakala Vangamayi Wedding : రాజకీయ ప్రముఖుల ఇళ్లలో వివాహం అంటే ఒక రేంజ్లో ఉండాల్సిందే. భారీ సెట్టింగ్‌లు, కళ్లు మిరుమిట్లుగొలిపే అలంకరణ, పసందైన వంటకాలతో ధూమ్ ధామ్‌గా జరగాల్సిందే. చుట్టూ అతిథులు, రాజకీయ ప్రముఖులు, అధికారులతో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. ప్రసార మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తుంటాయి. కానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం వీటన్నింటికీ భిన్నంగా జరిగింది. తన కుమార్తె వాంగ్మయి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించి ప్రత్యేకంగా నిలిచారు నిర్మల. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది.
పరకాల వాంగ్మయి పెళ్లి ప్రతీక్ దోషితో నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని నిర్మలా సీతారామన్ ఇంట్లోనే ఈ వివాహం జరిపించారు. బుధవారం ఈ వేడుకను పూర్తి చేశారు. కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు ఎవరూ ఈ కార్యక్రమానికి రాలేదని తెలిసింది. నిర్మలా సీతారామన్ కుటుంబ సభ్యులు ఈ వివాహానికి సంబంధించిన వివరాలను అధికారికంగా బయటకు వెల్లడించలేదు. కానీ, వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
![Parakala Vangamayi wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18710560_16x9_fm-shaadi--2.jpg)
![Parakala Vangamayi wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18709402_national2a_1.jpg)
![Parakala Vangamayi wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18710560_16x9_fm-shaadi--1.jpg)
సంప్రదాయం ఉట్టిపడేలా..
ఉడిపిలోని అదమరు మఠానికి చెందిన పురోహితులు ఈ వివాహ క్రతువును నిర్వహించారు. బ్రాహ్మణ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం వివాహం జరిపించారు. వధువు పరకాల వాంగ్మయి.. గులాబీ రంగు చీర, ఆకుపచ్చ రవికలో మెరిసిపోయారు. వరుడు ప్రతీక్ తెలుపు వర్ణం పంచెలో పెళ్లి వేదికపై కనిపించారు. నిర్మలా సీతారామన్.. మొలకల్మూరుకు చెందిన ప్రత్యేక చీరను ధరించి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
![Parakala Vangamayi wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18710560_16x9_fm-shaadi--4.jpg)
వాంగ్మయి.. ఫీచర్ రైటర్..
వధువు వాంగ్మయి.. ప్రఖ్యాత దిల్లీ యూనివర్సిటీ నుంచి ఆంగ్లంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. జర్నలిజంలోనూ ఆమెకు డిగ్రీ ఉంది. నార్త్‌వెస్ట్ యూనివర్సిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి పట్టా సాధించారు. జర్నలిజంలో ఎంఎస్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. తన కలానికి పదునుపెట్టారు. ప్రస్తుతం ఓ ప్రముఖ వార్తా సంస్థకు చెందిన వీక్లీ మ్యాగజైన్‌కు ఫీచర్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.
![Parakala Vangamayi wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18710560_16x9_fm-shaadi--3.jpg)
కుమార్తె మాత్రమే కాదు!
నిర్మలా సీతారామన్‌కు తన కుమార్తె వాంగ్మయితో మంచి అనుబంధం ఉంది. ఆమె తన కుమార్తె మాత్రమే కాదని, మంచి స్నేహితురాలు కూడా అని గతంలో ఓ సారి ట్వీట్ చేశారు నిర్మల. వాంగ్మయి తనకు ఓ మార్గదర్శి అని, ఫిలాసఫర్ అని అప్పటి ట్వీట్లో పేర్కొన్నారు. కుమార్తెల గురించి ఎక్కువగా చెప్పుకోలేమంటూ వాంగ్మయితో దిగిన పాత చిత్రాన్ని నెటిజన్లతో పంచుకున్నారు నిర్మల.
-
Can say so much and more about daughters. A #throwbackpic with my daughter. A friend, philosopher and a guide. Here’s this on #DaughtersDay pic.twitter.com/640XrUqm2n
— Nirmala Sitharaman (@nsitharaman) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Can say so much and more about daughters. A #throwbackpic with my daughter. A friend, philosopher and a guide. Here’s this on #DaughtersDay pic.twitter.com/640XrUqm2n
— Nirmala Sitharaman (@nsitharaman) September 22, 2019Can say so much and more about daughters. A #throwbackpic with my daughter. A friend, philosopher and a guide. Here’s this on #DaughtersDay pic.twitter.com/640XrUqm2n
— Nirmala Sitharaman (@nsitharaman) September 22, 2019
వరుడు ఎవరో తెలుసా?
ప్రతీక్ దోషి స్వస్థలం గుజరాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాగా సన్నిహితులని పేరు. సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు ప్రతీక్. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. సీఎంఓలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు. మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ప్రతీక్.. ప్రధానమంత్రి కార్యాలయాని(పీఎంఓ)కి బదిలీ అయ్యారు. 2014 నుంచి ఆయన పీఎంఓలోనే పనిచేస్తున్నారు. మోదీ రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ప్రతీక్‌కు జాయింట్ సెక్రెటరీగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం పీఎంఓలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా ప్రతీక్ సేవలందిస్తున్నారు. రీసెర్చ్, స్ట్రాటజీ విభాగంలోనే పనిచేస్తున్నారు.
నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్.. రాజకీయ- ఆర్థిక నిపుణులుగా సుపరిచితులు. 2014 నుంచి 2018 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా సేవలు అందించారు. కేబినెట్ ర్యాంకు హోదాలో ఆయన పనిచేశారు. అనేక ఏళ్లు టీవీ ఛానళ్లలో వర్ధమాన వ్యవహారాలపై చర్చలు నిర్వహించారు.