Neerav Modi Court: మోసం, మనీ లాండరింగ్ ఆరోపణలతో పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీకి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో నమోదైన కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు నీరవ్‌కు ఉన్న అన్ని మార్గాలు దాదాపు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. భారత్‌కు అప్పగించేందుకు అనుమతి ఇస్తూ లండన్ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌చేసేందుకు.. నీరవ్‌మోదీకి న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. సుప్రీంకోర్టులో అప్పీల్‌చేసేందుకు అనుమతి కోరుతూ నీరవ్‌మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు.. లండన్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మానసిక ఆరోగ్యాన్ని కారణంగా చూపుతూ తనను భారత్‌కు అప్పగించవద్దని గత నెల నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే ధర్మాసనం తోసిపుచ్చింది. రూ.11 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణాల కుంభకోణం కేసును ఎదుర్కొనేందుకు.. నీరవ్‌మోదీని భారత్‌కు అప్పగించటం అన్యాయం లేదా అణిచివేత కాదని ధర్మాసనం తీర్పు చెప్పింది.
నీరవ్‌ను భారత్‌కు అప్పగించడానికి సమ్మతిస్తూ గతేడాది అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్‌పై ఈ ఏడాది ఆరంభం నుంచి విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, హైకోర్టు తీర్పును 14 రోజుల్లోగా నీరవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేసుకునే వెసులుబాటు ఉండడం వల్ల.. అందుకు ఆయన అనుమతి కోరారు. ఈ అనుమతిని కూడా నిరాకరిస్తూ లండన్ హైకోర్ట్ తీర్పునిచ్చింది.