kodi katti case : విశాఖ విమానాశ్రయంలో 2018లో జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో జరిగిన కోడికత్తితో దాడి కేసులో విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో బాధితుడైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహా మరో తొమ్మిది మందిని విచారణకు రావాలంటూ తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 10న సీఎం జగన్‌తో పాటు అతని సహాయకులు నాగేశ్వరరెడ్డిని విచారణకు రావాలంటూ ఎన్ఐఏ కోర్ట్ న్యాయమూర్తి ఆంజనేయమూర్తి ఆదేశించారు. ఏప్రిల్ 11 నుంచి 17 వరకు ఇద్దరేసి సాక్షులు విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగు రోజులు కేటాయిస్తూ.. ఎనిమిది మందిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఏప్రిల్ 11న కృష్ణకాంత్, మళ్ల విజయప్రసాద్, 12న అడబాల సూర్యనారాయణ, కొండమూడి వేణుగోపాల్, 13న కొట్టాడ లలిత స్వాతి, డి.సాంబశివరెడ్డి, 17న ఆరిపాక రమాదేవి, జి.హేమలతను విచారణకు రావాలంటూ షెడ్యూల్ ప్రకటించింది.
ఈ రోజు విచారణ సందర్భంగా ఘటన జరిగిన నాటి ఎయిర్ పోర్ట్ ఆథారిటీ టీఐఎస్ఎఫ్ అధికారి దినేష్ కుమార్‌ను మరోసారి ప్రశ్నించింది. జగన్‌పై దాడి చేసిన యువకుడు శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న కోడికత్తి, మరో చిన్న కత్తి, పర్సు, చరవాణిలను ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానానికి అప్పగించారు. 2018 నుంచి ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు గత నాలుగేళ్లుగా జైలులోనే ఉన్నారు. శ్రీనివాసరావు బెయిల్ కోసం అతడి కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేసుకున్నా.. ఇంతవరకు మంజూరు కాలేదు. రాజమండ్రి జైలు నుంచి శ్రీనివాసరావును విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి ఏప్రిల్ 10కి వాయిదా వేశారు.
జగన్ మోహన్ రెడ్డిపై అటాక్ కేసులో సీఐఎస్ఎఫ్ కమాండెంట్ దినేశ్ కుమార్ ఈ రోజు కోర్టులో విచారణకు హాజరయ్యారు. దాడికి సంబంధించి కంప్లయింట్ ఇవ్వమని జగన్ మోహన్ రెడ్డి కూడా అడగలేదు. కానీ, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ దినేశ్ కుమార్ తన సొంత నిర్ణయం మేరకు ఫిర్యాదు చేశారు. కత్తితో దాడి జరిగిందనే విషయం కూడా కమాండెంట్‌కు తెలియదు.. ఇదే విషయాన్ని ఆయన కోర్టుకు తెలిపారు. చల్లా శ్రీను అనే వ్యక్తి కత్తిని తెచ్చి ఇచ్చాడని చెప్పాడు. ఐ విట్నెస్గా జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సహాయకుడు కూడా కోర్టు విచారణకు రావాల్సి ఉంటుంది. కేసు విచారణ తేదీని ఏప్రిల్ 10కి ఖరారు చేశారు. - అబ్దుల్ సలీం, న్యాయవాది
సాక్షుల జాబితాలో జగన్ పేరు.. కోడికత్తి కేసులో బాధితుడైన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తొలుత సాక్షిగా విచారించకుండా.. మిగతా సాక్షులను విచారిస్తే ఏం ప్రయోజనమని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ కోసం సిద్ధం చేసిన సాక్షుల జాబితాలో బాధితుడి పేరు కూడా చేర్చాలని, న్యాయస్థానం ఎదుట హాజరయ్యేలా చూడాలని ఎన్ఐఏ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.
సరిగ్గా రెండు నెలలకు... 2018 అక్టోబరు 25న విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. 2019 ఆగస్టు 13న ఎన్ఐఏ అభియోగపత్రం సమర్పించింది. కేసులో విచారణ షెడ్యూలు ఖరారు కోసం న్యాయస్థానంలో ఎన్ఐఏ ఈ ఏడాది జనవరి 14న మెమో దాఖలు చేసింది. మొత్తం 56 మందిని సాక్షులుగా పేర్కొని.. విచారణ కోసం సిద్ధం చేసిన జాబితాలో 10 పేర్లను పొందుపరిచింది. విచారణకు షెడ్యూలు కోరగా.. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాధితుడి పేరు చేర్చాలని... విచారించాల్సిన వారి జాబితాలో బాధితుడి పేరు ఎందుకు చేర్చలేదని సలీం తరఫు న్యాయవాది ప్రశ్నించారు. పదిమంది సాక్షులను విచారించాలని ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోరగా.. జడ్జి ఆంజనేయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కేసులో బాధితుడి సాక్ష్యం విలువైనదని గుర్తు చేస్తూ.. అది లేకుండా మిగతావారిని విచారించలేం అని స్పష్టం చేశారు. కోర్టు టేప్‌రికార్డర్ కాబోదని వ్యాఖ్యానించారు.
నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా శ్రీనివాసరావు... కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. విజయవాడ మెట్రోపొలిటిన్ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాసరావు ఇన్నాళ్లూ.. రాజమహేంద్రవరం కారాగారంలో ఉంటున్నాడు. విజయవాడ మెట్రోపొలిటిన్ సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరగ్గా.. నిందితుడు శ్రీనివాసరావును కారాగారం నుంచి బందోబస్తు మధ్య తీసుకొచ్చి హాజరు పరుస్తున్నారు. నాలుగేళ్లు దాటినా బెయిల్ ఇవ్వలేదని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం వాదిస్తున్నారు. బెయిల్ అయినా ఇవ్వాలని, లేదంటే ఏదో ఒక శిక్ష విధించాలని కోరగా.. ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు అడ్డుపడుతున్నారు.
ఇవీ చదవండి :