భారత్ వ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్రపన్నిన పాకిస్థాన్ ఉగ్రవాది బహదూర్ అలీకి.. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పదేళ్ల కఠిన ఏళ్ల కారాగార శిక్ష విధించింది. లష్కరే తోయిబాకు చెందిన ఈ ఉగ్రవాదికి జరిమానా కూడా వేసింది.
2016లో జమ్ముకశ్మీర్ ద్వారా భారత్లోకి ప్రవేశించి.. దిల్లీ సహా పలు ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని బహదూర్ అలీ సహా మరికొంత మంది ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రణాళిక అమలులో ఉన్న బహదూర్ అలీని అదే ఏడాది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకే47 గన్స్ , గ్రనేడ్లు, ఆర్మీ మ్యాప్ సహా భారీ ఆయుధ సామాగ్రితో కుప్వారాలో.. బహదూర్ అలీ పోలీసులకు పట్టుబడ్డాడు. తమదైన శైలిలో విచారించగా ఉగ్ర కుట్ర బయపడింది.
2017 జనవరిలో జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ.. అలీపై అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇదే ఉగ్రకుట్రలో భాగమైన మరో ఇద్దరు పాకిస్థానీ తీవ్రవాదులు.. 2017 ఫిబ్రవరిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో హతమయ్యారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు సహాయం అందించిన కొంత మంది కశ్మీరీలను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసి.. ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వారిపై విచారణ ఇంకా కొనసాగుతోంది.
ఇదీ చదవండి:ఇద్దరు బాలికలపై 8 మంది అత్యాచారం