ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మావోయిస్టు సానుభూతిపరుడు, ప్రస్తుతం తృణమూల్ పార్టీలో ఉన్న ఛత్రాధర్ మహతోను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను రెండు రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి తరలించారు. 2009లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలో మావోయిస్టు సానుభాతి సంస్థ 'పీసీపీఏ'కు కన్వీనర్‌గా ఛత్రాధర్ మహతో పనిచేశారు. 12ఏళ్ల క్రితం భువనేశ్వర్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఆయన కీలక సూత్రధారి. దీంతో ఆయనను యూఏపీఏ కింద అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. కోల్‌కతా కోర్టులో ప్రవేశపెట్టారు.
పదేళ్లు జైలు
అంతకు ముందు ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్రాధర్‌ను అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ కోల్‌కతా కోర్టు ఆదేశాలిచ్చింది. వారంలో మూడు రోజుల పాటు ఎన్‌ఐఏ అధికారుల ముందు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో అరెస్టు నుంచి బయటపడిన రెండు రోజుల్లోనే తాజాగా మరో కేసులో ఎన్‌ఐఏ అధికారులు మహతోను అరెస్టు చేశారు. తృణమూల్ నేత ఛత్రాధర్ మహతో.. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు ప్రాణహానికి కుట్ర పన్నిన కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. అంతేకాదు బాంబుదాడులు, మందుపాతర పేలుళ్ల వంటి ఘటనల్లో ఆయనపై కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న ఛత్రాధర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మధ్యే శిక్ష పూర్తి చేసుకున్న ఆయన 2020లో జైలునుంచి విడుదలయ్యారు. బయటకు వచ్చిన అనంతరం ఛత్రాధర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయనను మరోకేసులో ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
ఇదిలాఉంటే, గిరిజన ప్రాంతాల్లో మంచి పట్టున్న ఛత్రాధర్, తృణమూల్ కాంగ్రెస్‌కు గిరిజన ఓటర్లను ఆకర్షించే వ్యక్తిగా పేరుంది. తాజాగా ఆయన అరెస్టు ఎన్నికల్లో స్థానికంగా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 'కింగ్ మేకర్' ఆశలతో కూటమి అస్తిత్వ పోరు