మన సైకిల్ పోతే ఎవరన్నా తెచ్చిస్తారా? మాములుగా అయితే ఎవరూ తీసుకురారు. ఇక దాని గురించి దాదాపు మర్చిపోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెతికి తెచ్చిచ్చే ఛాన్స్ కొంతవరకు ఉంది. కానీ ఓ రాష్ట్ర సీఎం.. ప్రత్యేక చొరవచూపి సైకిల్‌ను పంపిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యకరంగా ఉంటుంది కదూ? అలాంటి సంఘటనే కేరళలో జరిగింది.
కొట్టాయం జిల్లాకు చెందిన సునీశ్ తన కుమారుడు జస్టిన్‌కు సైకిల్‌ను కొనిచ్చాడు. కానీ కొద్దిరోజుల్లోనే దాన్ని ఎవరో దొంగిలించారు. పోయిన సైకిల్ కోసం చాలా వెతికారు. ఎక్కడైనా తన సైకిల్ కనపడితే సమాచారం ఇవ్వాల్సిందిగా ఫేస్బుక్లో.. దివ్యాంగుడైన ఆ తండ్రి పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ అయింది.
అయితే మరిసటిరోజే సైకిల్ ప్రత్యక్షమైంది. కానీ అది తన సైకిల్ కాదు. తన సైకిల్ రంగును పోలిన మరో సైకిల్.
ఆ సైకిల్‌ను పంపించింది మామూలు వ్యక్తి కాదు.. సాక్షాత్తు సీఎం పినరయి విజయన్. ముఖ్యమంత్రి ఆదేశాలతో సునీశ్కు జిల్లా కలెక్టర్ ఎం. అంజనా సైకిల్‌ను అందజేశారు. దీంతో ఆ తండ్రి ఆశ్చర్యానికి గురైయ్యాడు. అతని కుమారుడైతే సీఎం పంపిన కొత్త సైకిల్‌ను చూసి మురిసిపోతున్నాడు.
ఇదీ చూడండి: కోరిక తీర్చలేదని శిశువును మంటల్లో వేసి...