Odisha Wedding: కోటి ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడికి క్షణాల్లోనే ఊహించని పరిస్థితి ఎదురైంది. తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసి అతడి హృదయం ముక్కలైంది. ఒడిశా భద్రక్ జిల్లా వాసుదేవ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాసియ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అమ్మాయి అవతారంతో మోసం చేసిన యువకుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఏం జరిగిందంటే..?: బంగాల్ ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీ అనే యువకుడికి.. ఒడిశా కేంద్రపఢా జిల్లాకు చెందిన మేఘన అనే అమ్మాయితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. 15 రోజులకే ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మే 24న జాజ్పుర్లోని ఛండీఖోల్లో మేఘనను కలిశాడు అలోక్. అనంతరం ఆమెను మేనమామ ఇంటికి తీసుకెళ్లి వారికి పరిచయం చేశాడు. వీరి పెళ్లికి కుటుంబపెద్దలు కూడా ఒప్పుకున్నారు. దీంతో వివాహం ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ అతిథి పెళ్లికూతుర్ని మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అతని పేరు మేఘనాథ్ అని, తమకు దగ్గరి బంధువే అని ఆ అతిథి వెల్లడించాడు. ఇది విని వరుడి కుటుంబసభ్యులు కంగుతిన్నారు. గ్రామస్థులు వెంటనే మేఘనాథ్ను చితకబాదారు. బట్టలు చింపివేశారు. అతను అబ్బాయి అని తెలిశాక పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మేఘనాథ్ను అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇది చదవండి: 'హాలీవుడ్' స్టైల్లో లగ్జరీ కార్లు చోరీ.. ఒక్కనెల్లోనే 40.. ఎలా దొరికారంటే?