నాలుగు రోజులు చికిత్స అనంతరం నవజాత శిశువు మరణించినట్లు తేల్చారు వైద్యులు. చేసేదేమీ లేక ఖననం చేసేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. చివరి క్షణంలో.. పాప ఊపిరి తీసుకోవటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మరో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలో శనివారం జరిగింది.
ఇదీ జరిగింది: జిల్లాలోని తురువిహాల గ్రామానికి చెందిన ఈరప్ప, అమరమ్మ దంపతులకు మే 10వ తేదీన ఊరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడశిశువు జన్మించింది. మెరుగైన చికిత్స అవసరమని భావించిన అక్కడి వైద్యులు.. సిద్ధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ, తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సిద్ధనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన మౌలిక వసతులు లేనందునే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లామని తెలిపారు.
పాపను ఆసుపత్రిలో చేర్చుకున్న అక్కడి వైద్యులు.. 4 రోజులు చికిత్స అందించారు. అందుకు రోజుకు రూ.10-12వేల వరకు ఫీజు వసూలు చేశారు. అయితే.. శనివారం పాప చనిపోయిందని వెల్లడించారు. దాంతో పాపను తురువిహాల గ్రామానికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అదే రోజున(మే 14) అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో పాప ఊపిరి తీసుకోవటాన్ని గమనించాడు ఓ వ్యక్తి. పాప ప్రాణాలతోనే ఉందని గుర్తించి.. శ్మశానవాటిక నుంచి హుటాహుటిన సింధనూరులోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాపకు వైద్యం అందిస్తున్నారు. శిశువు మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యుడిపై దాడి చేశారు కుటుంబ సభ్యులు.
ఇదీ చూడండి: ఇద్దరు పిల్లల్ని రైలులో నుంచి తోసేసి, దూకిన మహిళ.. లక్కీగా...