మైనార్టీల ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఓ కొత్త రాజకీయ పార్టీకి భాజపా రహస్యంగా మద్దతిస్తోందని ఆరోపించారు బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఆ పార్టీ వ్యవస్థాపకుడు భాజపా నుంచి డబ్బులు తీసుకుంటున్నారని దక్షిణ 24 పరగణాల జిల్లా పత్తర్ప్రతిమలో నిర్వహించిన బహిరంగ సభలో దుయ్యబట్టారు.
శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మత గురువు పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ ప్రారంభించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఈ విమర్శలు చేశారు మమత.
"భాజపా ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. మైనారిటీ ఓట్లను చీల్చి భాజపాకు సాయం చేయాలని చూస్తోంది. దయచేసి ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయవద్దు."
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
కాంగ్రెస్, సీపీఎం.. భాజపాతో ఒప్పంద కుదుర్చుకున్నాయని ఆరోపించారు మమత. పౌర చట్టం, ఎన్పీఆర్ బంగాల్లో అమలు కాకుండా చూడడం, వివిధ వర్గాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించడం టీఎంసీకి మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కేరళలో అధికారం లేదా 'కింగ్‌మేకర్'గా భాజపా'