మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నవేళ.. ఆసుపత్రుల్లో పడకల కొరత లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసులు అధికంగా నమోదవుతున్న పుణెలో ఓ హోటల్‌ను కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. కాట్రాజ్ ప్రాంతంలోని హోటల్లో కొవిడ్ చికిత్స నిమిత్తం 80 పడకలను అధికారులు ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స కోసం ఆక్సిజన్ని సైతం అందుబాటులో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా పరిస్థితుల ఆధారంగా అవసరమైతే మే 1 తర్వాత కూడా ఆంక్షలను అమలు చేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు.
బోసిపోయిన బస్టాండ్లు..
దిల్లీలో కొవిడ్ వ్యాప్తి నిరోధానికి విధించిన వారాంతపు లాక్ డౌన్ అమలవుతోంది. పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే.. అనుమతిస్తున్నారు. మాస్కు పెట్టుకోకపోతే జరిమానా విధిస్తున్నారు. వారాంతపు లాక్ డౌన్‌తో ప్రధాన బస్టాండ్లు బోసిపోగా.. రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ కొనసాగుతోంది. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో దహన సంస్కారాలు ఆలస్యమై భారీ సంఖ్యలో మృతదేహాలు హిండన్ శ్మశానవాటిక వెలుపలే నిలిచిపోయాయి. శ్మశాన వాటికలో కనిపించిన ఈ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
రూ.500 జరిమానా
కొవిడ్ కట్టడి కోసం రైల్వే ప్రాంగణాలు, రైళ్లలో మాస్కులు ధరించకుంటే రూ.500 జరిమానా విధిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మాస్కు ధరించకుండా స్టేషన్లు, రైళ్లలోకి ప్రవేశించడం ప్రజారోగ్యానికి పెను ముప్పు అని రైల్వే శాఖ పేర్కొంది.
భోపాల్‌లో కర్ఫ్యూ పొడిగింపు
మధ్యప్రదేశ్ భోపాల్‌లో కర్ఫ్యూ పొడిగించారు అక్కడి అధికారులు. కరోనా కట్టడికి ఈ నెల 26 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు ఇండోర్ జిల్లాలో ఏప్రిల్ 12 విధించిన పాక్షిక లాక్డౌన్ ఈ నెల 23 వరకు అమలవుతుందని అధికారులు పేర్కొన్నారు.
పెళ్లికి ముందుగా రిజిస్ట్రేషన్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళలో కఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయించారు అధికారులు. పెళ్లిళ్లు, గృహ ప్రవేశం వంటి వేడుకలకు ముందుగానే 'కొవిడ్-19 జాగ్రత్త పోర్టల్'లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ వేడుకలకు 75 నుంచి 150 మంది మించి హాజరుకాకూడదని రాష్ట్ర ప్రధాని కార్యదర్శి డాక్టర్ వీపీ జాయ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'అవసరమైతే కొవిడ్ బోగీలను వినియోగించుకోండి'