New Covid 19 Cases In India : దేశంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 412 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,33,337కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,50,09,660కు పెరిగిందని తెలిపింది.
69కి చేరిన జేఎన్ 1 కేసులు
కొవిడ్ ఉపరకం జేఎన్ 1 కేసులు సోమవారం నాటికి 69కి చేరుకున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో అత్యధికం హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు, వీరు ఆస్పత్రిలో చేరే రేటులో కూడా ఎటువంటి పెరుగుదల లేదని అధికారులు తెలిపారు. చేరిన వారంతా ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చినవారేనని చెప్పారు. 'కొత్త వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాం. అయితే రాష్ట్రాల్లో పరీక్షలను వేగవంతం చేయడం సహా వాటి నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం చాలా ఉంది' అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి. కె పాల్ పేర్కొన్నారు.
220 కోట్ల వ్యాక్సిన్‌లు పంపిణీ
గోవాలో అత్యధికంగా 34 జేఎన్.1 రకం కేసులు, మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో రెండు, తెలంగాణలో రెండు చొప్పున నమోదయ్యాయి. తాజాగా నమోదైన 6 జేఎన్.1 రకం కేసులతో కలుపుకొని కొత్త ఉపరకం కేసుల సంఖ్య 69కి చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,72,153కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మాస్క్ మస్ట్
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది కేంద్రం. కొవిడ్‌కు సంబంధించి ఇప్పటికే పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పాటించడం, పరిశుభ్రత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఫార్సు చేసింది కేంద్ర వైద్యారోగ్య శాఖ.
దేశంలో 63 కొవిడ్ జేఎన్.1 కేసులు- ఆ రాష్ట్రంలోనే అత్యధికం
'కరోనా కొత్త వేరియంట్‌తో భయం లేదు- వ్యాక్సిన్ ఎక్స్ట్రా డోస్ కూడా!'