New CDS appointment: నూతన త్రిదళాధిపతిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్‌ను ప్రభుత్వం ఖరారు చేస్తోందని చెప్పారు. ఈ ప్యానెల్ సిఫారసు చేసిన పేర్లను రాజ్‌నాథ్ సింగ్‌కు పంపుతామన్నారు. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం సీడీఎస్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే కేబినెట్ నియామకాల కమిటీ వద్దకు పేర్లు వెళతాయన్నారు.
New CDS of India
కొత్త సీడీఎస్‌గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నాయి. అనుభవంలో అందరికన్నా సీనియర్ కావడం వల్ల ఈ పదవి దాదాపు ఆయనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ నుంచి 2019, డిసెంబర్ 31న బాధ్యతలు స్వీకరించారు నరవణె. 2022, ఏప్రిల్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ప్రస్తుతం నౌకాదళ అధినేత అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఆ బాధ్యతలు నవంబర్ 30నే స్వీకరించారు. అలాగే, వాయుసేన చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి సెప్టెంబర్ 30న బాధ్యతలు తీసుకున్నారు. వీరు పదవులు చేపట్టి కేవలం రెండు నెలలు పూర్తయింది.
Bipin Rawat Successor: త్రివిధ దళాలకు అధిపతుల ఎంపికకు అనుసరిస్తున్న విధానాన్నే సీడీఎస్ విషయంలోనూ కేంద్రం పాటించనుంది. చీఫ్స్ ఆప్ స్టాఫ్ కమిటీ(సీఓఎస్సీ)కి సీడీఎస్ అధిపతిగా వ్యవహరిస్తారు.
తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది చనిపోయారు. మృతుల్లో రావత్ సతీమణి కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: CDS Chopper Crash: మరో రెండు వారాల్లో ట్రై సర్వీస్ విచారణ పూర్తి!