దేశంలో మొత్తం 98.5 లక్షల టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం 2,10,809 సెషన్లలో.. 98,46,523 డోసులు పంపిణీ చేసినట్టు తెలిపింది.
వేగంగా డోసులు..
98.5లక్షల డోసులను పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య నిపుణులకు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 62,34,635 మంది వైద్య సిబ్బందికి మొదటి డోసు టీకా పంపిణీ చేయగా.. 4,64,932మంది రెండో డోసు తీసుకున్నారని వెల్లడించింది. ఇవాళ ఒక్క రోజే 3,17,190 మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. వీరిలో 2,21,425 మంది మొదటి డోసు లబ్ధిదారులు కాగా.. 95,765 మంది రెండో డోసు తీసుకున్నవారు.
కొన్నిచోట్ల మందకొడిగా..
ఇక అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇవాళ ఒక్కరోజే 10,159 సెషన్లు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం 11 రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 75శాతం మందికి మొదటి డోసు పంపిణీ పూర్తవ్వగా.. ఇతర రాష్ట్రాల్లో 50శాతం మందికే పూర్తైందని వివరించింది. మరోవైపు 15రాష్ట్రాల్లో 40శాతం మంది పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే మొదటి డోసు అందిందని తెలిపింది.
0.0004శాతమే..
దేశవ్యాప్తంగా టీకా డోసు తీసుకున్న అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలతో 40(0.0004శాతం) మంది ఆసుపత్రిలో చేరగా.. వీరిలో 24మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 13మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
ఇదీ చదవండి: 'మహమ్మారిపై పోరులో ఐకమత్యమే ఆయుధం'