ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్‌ను భాజపా అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ధన్‌ఖడ్ మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని నడ్డా పేర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రజల గవర్నర్‌గా పేరు సంపాదించారని కొనిడాయారు. నవభారత్ స్ఫూర్తికి ఆయన జీవితం అద్దం పడుతుందని భాజపా నేతలు పేర్కొన్నారు. ఆర్థిక, సామాజికపరమైన అనేక అడ్డంకులు, అవాంతరాలు అధిగమించి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని వివరించారు.
అంతకుముందు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమావేశానికి హాజరయ్యారు. అన్ని అంశాలను బేరీజు వేసుకొని ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేశారు. ఉప రాష్ట్రపతి పదవికి కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురి పేర్లు వినిపించగా, అనూహ్యంగా భాజపా పార్లమెంటరీ పార్టీ ధన్‌ఖడ్ పేరును ఖరారు చేసింది.
న్యాయవాది.. ఎమ్మెల్యే.. ఎంపీ..
భారతదేశ రెండో అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపికైన జగదీప్ ధన్‌ఖడ్ రాజస్థాన్‌లోని.... ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. ఆయన కిసాన్‌పుత్ర అనే గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తోడ్‌గఢ్ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందిన ధన్‌ఖడ్.. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు.
అనంతరం ధన్‌ఖడ్ జనతాదళ్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 30 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. 1989లో ఝుంఝునూ నుంచి ఆ పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో పార్లమెంట్ వ్యవహారాల సహాయశాఖమంత్రిగా ఆయన పనిచేశారు. 1993లో రాజస్థాన్‌లోని కిషన్‌గడ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 జులై నుంచి బంగాల్ గవర్నర్‌గా పని చేస్తున్నారు. బంగాల్ ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్‌గా అనేక సందర్భాల్లో.. జగదీప్ తీవ్రంగా విభేదించారు. మమతా సర్కార్ తీరును ఎన్నోసార్లు బహిరంగంగానే విమర్శించారు.