Naxalite weapons: నక్సలైట్లు ఆటోమేటిక్ రైఫిళ్లు, ఇతర అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఝార్ఖండ్‌లో పట్టుబడిన ఓ నక్సలైట్ ఫోన్లో ఆటోమేటిక్‌గా పని చేసే అత్యాధునిక ఆయుధాల చిత్రాలు ఉండటం ఆ వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది. నిషేధిత నక్సలైట్ ఆర్గనైజేషన్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పీఎల్ఎఫ్ఐ) చెందిన ఓ నక్సలైట్ ఫోన్లో ఈ ఆయుధాల చిత్రాలు లభించినట్లు ఝార్ఖండ్ పోలీసులు తెలిపారు. వారికి చైనా, పాకిస్థాన్‌ల నుంచి సాయం అందుతుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
జనవరి 10న బిహార్‌లోని బక్సర్ జిల్లా ఇండస్ట్రీయల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జాతీయ రహదారి 84పై బంగాల్ రిజిస్ట్రేషన్ ఉన్న కారులో పీఎల్ఎఫ్ఐకి చెందిన నక్సలైట్లు వెళ్తున్నట్లు రాంచీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్‌కు సమాచారం ఇచ్చారు రాంచీ పోలీసులు. ఆయన ఆదేశాలతో బిహార్-ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దులోని వీర్ కున్వార్ సింగ్ సేతూ వంతెన వద్ద తనిఖీలు చేపట్టారు. పీఎల్ఎఫ్ఐకి చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల నగదు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు ఓ మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు.
పీఎల్ఎఫ్ఐ సంస్థకు చెందిన అధినేత దినేశ్ గోపికి ప్రత్యేక సహాయకుడు, రాంచీలోని ధుర్వకు చెందిన నివేశ్ కుమార్ అనే నక్సలైట్ ఫోన్లో ముఖ్యమైన ఆధారాలు, పలు ఆయుధాల చిత్రాలు లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అందులో ఇప్పటి వరకు భారత్‌లో ఉపయోగించని స్విస్ రైఫిల్ ఫొటో ఉండటం మరింత అనుమానాలు రేపినట్లు చెప్పారు అధికారులు. పీఎల్ఎఫ్ఐ అధినేత దినేశ్.. విదేశాల నుంచి ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు తెలిసిందన్నారు.
దిల్లీ నుంచి ఝార్ఖండ్‌కు వయా పూర్ణియా మీదుగా వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నివేశ్ కుమార్ నేపాల్ వెళ్లేందుకు ఈ ప్రయాణం చేపట్టారన్నారు. నేపాల్‌లోని అక్రమ ఆయుధాల రవాణా ముఠాలతో నివేశ్కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
ఇదీ చూడండి:
'పాఠశాల విద్యార్థులను ప్రలోభ పెట్టి అడవిబాట పట్టిస్తున్న నక్సల్స్'