Navy Officer Fraud : హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్రాంత నౌకాదళ ఉద్యోగి పక్కా స్కెచ్ వేశాడు. ఓ ఇద్దరు కూలీలను చంపి దహనం చేసి.. అందులో తాను ఉన్నట్లు అందరినీ నమ్మించాడు. పేరు మార్చుకుని వేరే ప్రాంతానికి పరారయ్యాడు. ఈ ఘటన 20 ఏళ్ల కింద జరగగా.. తాజాగా బయటకువచ్చింది. ప్రస్తుతం అమన్‌సింగ్‌గా పేరు మార్చుకుని దిల్లీలోని నజఫ్‌గఢ్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్న బాలేశ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు మంగళవారం ప్రకటించారు.
ఇదీ జరిగింది
పానీపత్కు చెందిన 63 ఏళ్ల బాలేశ్ కుమార్.. 15 సంవత్సరాలు నౌకాదళంలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. 1981 నుంచి 1996 వరకు నేవీలో పనిచేసి రిటైరై ఉత్తమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. 2004లో నిందితుడు, మాజీ నేవీ ఉద్యోగి బాలేశ్ కుమార్.. తన బంధువు రాజేశ్ అలియాస్ కుశీరామ్‌ను డబ్బుల విషయమై దిల్లీలో హత్య చేశాడు. అప్పుడు నిందితుడి వయసు 40 సంవత్సరాలు. రాజేశ్ భార్యతో నిందితుడు బాలేశ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హత్యతో సంబంధం ఉన్న బాలేశ్ సోదరుడు సుందర్‌లాల్‌ను 2004లో అరెస్టు చేశారు పోలీసులు.
అయితే, రవాణా వ్యాపారం చేసే బాలేశ్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి ఓ ట్రక్కులో రాజస్థాన్ పారిపోయాడు. అక్కడే ట్రక్కుకు నిప్పంటించి, తన వద్ద పనిచేసే బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలను సజీవ దహనం చేశాడు. అందులో తన మృతదేహం ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులు నమ్మేలా చేశాడు. దీంతో రాజస్థాన్ పోలీసులు ప్రధాన నిందితుడు మరణించాడని పేర్కొంటూ ట్రక్కు దహనం కేసును మూసివేశారు. అనంతరం పంజాబ్ పారిపోయిన బాలేశ్ అక్కడ తన పేరును అమన్‌సింగ్ అని మార్చుకుని నకిలీ పత్రాలు సృష్టించాడు. ప్రస్తుతం దిల్లీలో స్థిరాస్తి వ్యాపారిగా పనిచేస్తున్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఇటీవల క్రైమ్ బ్రాంచ్ నుంచి సమాచారం అందడం వల్ల నిందితుడిని అరెస్టు చేశారు. 20 ఏళ్ల నాటి కేసును తిరిగి ఓపెన్ చేసిన పోలీసులు.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
వెబ్ సిరీస్ చూసి మర్డర్ స్కెచ్.. భార్య ఆత్మహత్యను షూట్ చేసిన భర్త