అఫ్గానిస్థాన్ అంశంపై భారత్ నిర్వహిస్తున్న సమావేశానికి (NSA meeting on Afghanistan) ఏడు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు హాజరయ్యారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వంలో వీరంతా భేటీ అయ్యారు. రష్యా, ఇరాన్, తజికిస్థాన్, కిర్జిస్థాన్, కజఖ్‌స్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ దేశాల ఎన్ఎస్ఏలు ఈ భేటీకి హాజరయ్యారు.
ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గర్వకారణమని సమావేశం (NSA meet on Afghanistan) సందర్భంగా డోభాల్ వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను భారత్ (NSA meeting 2021) సునిశితంగా గమనిస్తోందని చెప్పారు. అఫ్గానిస్థాన్ పరిస్థితులు అక్కడి ప్రజలపైనే కాకుండా.. పొరుగు దేశాలపైనా ప్రభావం చూపిస్తాయని అన్నారు.
"మన మధ్య సన్నిహిత సంప్రదింపులు జరగాల్సిన సమయం ఇది. ప్రాంతీయ దేశాల మధ్య సహకారం, చర్చలు జరగాలి. మన చర్చలు ఫలప్రదంగా, ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నా. భద్రతను పెంపొందించే విధంగా.. అఫ్గానిస్థాన్ ప్రజలకు సహాయం చేసేలా చర్చలు సాగుతాయని విశ్వసిస్తున్నా."
-అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు
ఈ సమావేశంలో(india meeting on afghanistan) అఫ్గాన్‌లో ఉగ్రవాదం, ఇతర దేశాలకు అక్కడి ఉగ్రకార్యకలాపాల వల్ల పొంచి ఉన్న ముప్పు, అక్కడి అతివాదంపై ప్రధానంగా చర్చ జరగనుంది. అఫ్గాన్‌లో ప్రస్తుతమున్న భావజాలం తమ దేశాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈ దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే అఫ్గాన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్, అమెరికా సైన్యం విడిచివెళ్లిన అత్యాధునిక ఆయుధాలను తాలిబన్లు దుర్వినియోగం చేస్తారేమోననే భయాలు ఉన్నాయి. వీటన్నింటికీ మించి తర్వాత ఏం జరుగుతుందోననే అనిశ్చితిపై ఈ ఏడు దేశాల సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశముంది.
చైనా, పాక్.. నిరాకరణ
అఫ్గాన్ సమస్యపై చర్చించేందుకు ఇన్ని దేశాలతో భారత్.. ఈ తరహా సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ ఫార్మాట్‌ను అనుసరించి సమావేశానికి హాజరుకావాలని చైనా, పాకిస్థాన్‌కు కూడా భారత్ ఆహ్వానం పంపింది(india role in afghanistan ). అయితే ఊహించినట్టే ఈ రెండు దేశాలు భేటీలో పాల్గొనేందుకు నిరాకరించాయి. షెడ్యూల్ సమస్య కారణంగా తాము రాలేమని చైనా సాకు చెప్పింది. అయితే అఫ్గాన్ అంశంపై భారత్‌తో ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని పేర్కొంది. గతంలో ఇరాన్ ఆతిథ్యమిచ్చిన రెండు సమావేశాలతో పాటు, బ్రిక్స్ సమావేశానికి మాత్రం చైనా హాజరైంది.
ఇదీ చదవండి: స్వయంకృతాపరాధంలో పాక్- బుస కొడుతున్న ఉగ్రనాగు