Rahul Gandhi ED probe: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సైతం ఈడీ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఆయన్ను ఈడీ విచారిస్తోంది. సోమవారం సైతం రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. సోమవారం విచారణకు నాలుగో రోజు కాగా.. ఇప్పటివరకు 38 గంటల పాటు రాహుల్‌ను ఈడీ విచారించింది.
National Herald Rahul Gandhi: ఆదివారం రాహుల్ గాంధీ 52వ పుట్టినరోజు కాగా.. ఆ తర్వాతి రోజే ఈడీ ముందు హాజరయ్యారు. జూన్ 17న ఈడీ విచారణకు హాజరైన రాహుల్.. రెండ్రోజులు విరామం ఇవ్వాలని అధికారులను కోరారు. తన తల్లి సోనియా గాంధీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో విరామం కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో రాహుల్‌ను సోమవారం రావాలని ఈడీ పేర్కొంది. ఈ ప్రకారం.. సోమవారం ఉదయం 11.05 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో ఉన్న ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారు. గతవారం తరహాలోనే ఈడీ ఆఫీస్ పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. భారీ సంఖ్యలో పోలీసులను, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. మధ్యాహ్నం 3.45 గంటలకు భోజన విరామం తీసుకున్న రాహుల్.. 4.45 గంటలకు మళ్లీ ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు.
ED Rahul Probe:
ఇప్పటివరకు నాలుగు రోజులు రాహుల్‌ను ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో సోనియా గాంధీకి సైతం నోటీసులు పంపారు. జూన్ 23న హాజరు కావాలని స్పష్టం చేశారు. మరోవైపు, దర్యాప్తు సంస్థ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నేతలు జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు చేశారు.
ఇదీ కేసు..: నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణకర్తగా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కొందరు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని సోనియా, రాహుల్ తదితరులు కుట్ర పన్నినట్లు భాజపా నేత సుబ్రమణ్యస్వామి 2012లో ఫిర్యాదు చేశారు. 'యంగ్ ఇండియన్'లో రాహుల్ గాంధీకి 38 శాతం వాటా ఉంది. ఏజేఎల్ కార్యకలాపాల్లోనూ ఆయన పాత్ర చాలా ముఖ్యమైనదని ఈడీ చెబుతోంది. అందుకే ఆయన్ను విచారించడం అవసరమని వాదిస్తోంది.
ఇదీ చదవండి: