Narendra Modi Youtube Subscribers : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు కలిగిన నేతగా మోదీ రికార్డు సాధించారు. ప్రస్తుతం మోదీ యూట్యూబ్ ఛానెల్‌కు 2 కోట్లకు పైగా సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. వ్యక్తిగత యూట్యూబ్ ఖాతాతో ఈ ఘనత సాధించిన ఏకైక ప్రపంచ నేత కూడా మోదీనే. సబ్స్క్రైబర్లతో పాటు వ్యూస్‌లోనూ మిగతా అందరి నేతలకు అందనంత దూరంలో నిలిచారు. సుమారు 450 కోట్ల వ్యూస్‌తో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 22.4 కోట్ల వ్యూస్‌తో జెలెన్స్కీ రెండో స్థానంలో నిలిచారు. మోదీ ఖాతా వ్యూస్‌తో పోల్చుకుంటే ఇది దాదాపు 43 రెట్లు అధికం.
సబ్క్స్రైబర్ల విషయంలో మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు యూట్యూబ్‌లో సుమారు 64 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ప్రధాని మోదీతో పోల్చుకుంటే ఇది మూడో వంతు కంటే తక్కువ. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 11 లక్షలతో మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 7.89 లక్షలు, ఈజిప్ట్ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 3.16 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు.
2007లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రధాని మోదీకి సంబంధించిన మరో ఛానెల్ యోగా విత్ మోదీకి సైతం సుమారు 73,000 వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక భారత్ విషయానికొస్తే, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 35 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇది మోదీ సబ్స్క్రైబర్లతో పోలిస్తే ఆరో వంతులో కొంచెం ఎక్కువ.
ట్విట్టర్లో మోదీనే టాప్
మరోవైపు, దేశంలో అత్యధికంగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ X (ట్విట్టర్)లో అత్యధిక ఫాలోవర్స్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 91.5 మిలియన్లు(9 కోట్ల 15 లక్షలు) ఉండగా.. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ట్విట్టర్ ఖాతాను 54 మిలియన్ల (5.4 కోట్ల) మంది ఫాలో చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాకు 33.7 మిలియన్ (3.37 కోట్ల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 26 మిలియన్ (2.6 కోట్లు) దాటింది.
Modi Whatsapp Channel : వాట్సాప్ ఛానెల్లోకి మోదీ ఎంట్రీ.. కొత్త పార్లమెంట్లో ఫొటోతో పోస్ట్