ఓట్ల కోసం అమలు చేసే ప్రజాకర్షక పథకాలు దేశాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఓట్ల కోసం అలాంటి పథకాలు ప్రకటించడాన్ని షార్ట్‌కట్ రాజకీయాలుగా అభివర్ణించారు. వీటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ తప్పదని స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లోని దేవ్గఢ్లో రూ.16,800 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.
"షార్ట్‌కట్ రాజకీయాలనే పెను సవాలును దేశం ఎదుర్కొంటోంది. షార్ట్‌కట్ రాజకీయాలపై ఆధారపడే దేశానికి షార్ట్ సర్క్యూట్ తప్పదన్నది సత్యం. షార్ట్‌కట్ రాజకీయంతో దేశమే ధ్వంసం అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. మనమంతా కఠోర శ్రమతో నవభారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రజాకర్షక పథకాలతో ఓట్లు సంపాదించడం సులువే. కానీ.. అలాంటి షార్ట్కట్లు అవలంబిస్తే దీర్ఘకాలిక దుష్పరిణామాలు ఉంటాయి" అని హెచ్చరించారు మోదీ.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనుసంధానతను పెంచడం సహా ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయని ప్రధాని అన్నారు. ఇవన్నీ దీర్ఘకాలంలో తూర్పు భారతానికి మేలు చేస్తాయని వివరించారు. గత 8ఏళ్లలో కేంద్రం ఈ ప్రాంతంలో రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు.
"రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అనే ఆలోచనతో దేశం గత 8ఏళ్లుగా పని చేస్తోంది. మేం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి, ఉపాధి కోసం కొత్త దారులను వెతుకుతున్నాం. అభివృద్ధి ఆకాంక్షలకు మేం ప్రోత్సాహం ఇచ్చాం. కష్టతరం అనుకున్న రంగాలపై మా ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోంది." అని చెప్పారు ప్రధాని.
ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా దేవ్గఢ్లో ప్రధాని 12 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి... మోదీపై పూల వర్షం కురిపించారు. జ్యోతిర్లింగ క్షేత్రం వైద్యనాథ్‌లో ప్రత్యేక పూజలు చేశారు.