Nijam Gelavali yatra in Tirupati: తెలుగుదేశం అధినేక చంద్రబాబు సతీమణి నారా భుననేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" యాత్ర రెండోరోజు శ్రీకాళహస్తి, తిరుపతి నియోజవర్గాల్లో సాగింది. బాబు అరెస్టుతో ఆవేదన చెంది ప్రాణాలొదిలిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భువనేశ్వరి... బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందించారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వచ్చిన నారా భువవేశ్వరి... రెండో రోజు పర్యటనలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను.. పలకరించారు. నారావారిపల్లె నుంచి బయలుదేరిన భువనేశ్వరికి... శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
3 లక్షల ఆర్థిక సాయం: శ్రీకాళహస్తి నుంచి బయలుదేరి తొట్టంబేడు మండలం తంగెళ్లపాలెంలోని మోడం వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించారు. వెంకటరమణ చిత్రపటం వద్ద నివాళులు అర్పించి.... బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. అక్కడి నుంచి కొనతనేరిలో గాలి సుధాకర్ ఇంటికి భువనేశ్వరి వెళ్లారు. సుధాకర్ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకో మాట్లాడారు. 3 లక్షల ఆర్థిక సాయం అందించి... తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తర్వాత కాసారం గ్రామానికి వెళ్లిన భువనేశ్వరి... అక్కడ వెంకటసుబ్బయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి... వారిని ఓదార్చారు. పార్టీ తరపున అన్నివిధాలా అండగా ఉంటామని భువనేశ్వరి వారికి భరోసా ఇచ్చారు.
ముఖాముఖి కార్యక్రమం పాల్గొన్న భువనేశ్వరి: రెండో రోజు తిరుపతిలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తప్పుడు కేసులు పెట్టి 48 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజల నుంచి ఎవరు దూరం చేయలేరని... ఆయన పై నమ్మకంతో ప్రజలంతా రోడ్ల పైకి వచ్చి పోరాడుతున్నారన్నారు. చంద్రబాబు అరెస్టుతో మా కుటుంబసభ్యులం నాలుగు దిక్కులుగా విడిపోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు చేసి కేసులు పెట్టి వేధించడంలో రాష్ట్రం మొదటిస్ధానంలో ఉందన్నారు. ఆనాడు మహత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడితే... మనమంతా వైసీపీ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు.
తల్లికి మద్దతుగా నారా లోకేశ్ ట్వీట్: చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టామని వైసీపీ సైకోలు అనుకుంటున్నారని... కానీ ఈ నిర్బంధాలు చంద్రబాబును ప్రజల నుంచి దూరం చేయలేవని తన తల్లి నిరూపిస్తోందని నారా లోకేశ్ అన్నారు. నిజం గెలిచి తీరుతుందని... ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు మరింత బలంగా పనిచేస్తారని భువనేశ్వరి మాటలతో స్పష్టమవుతోందని లోకేశ్ ట్వీట్ చేశారు.