Nara Bhuvaneshwari Speech in Nijam Gelavali Public Meeting: తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని నారా భువనేశ్వరి అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాలలో నిర్వహించిన ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భువనేశ్వరి మాట్లాడారు.
ఈ పోరాటం ప్రజలందరిదీ: తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానన్న భువనేశ్వరి.. తాను రాజకీయాలు చేసేందుకు రాలేదు.. నిజం గెలవాలి అని చెప్పేందుకే వచ్చానని స్పష్టం చేశారు. ఈ పోరాటం తనది కాదని.. ప్రజలందరిదీ అని పేర్కొన్నారు. ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు చేశామన్న భువనేశ్వరి.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నామని అన్నారు.
లక్షల మంది కుటుంబాల్లో సంతోషం నింపారు: చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని.. ప్రజల తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారని భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు. సరైన రోడ్డు లేని, రాళ్లు, రప్పలు ఉన్న ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటని నిర్మాణ సమయంలో అందరూ ఎగతాళి చేశారని.. అయినా అవేవీ పట్టించుకోకుండా చిత్తశుద్ధితో పనిచేసి.. దాని ద్వారా లక్షల మంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారని అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే చంద్రబాబు నిత్యం ఆలోచించేవారని తెలిపారు.
ఏ కేసులోనైనా ఆధారాలు ఉన్నాయా: స్కిల్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కేసులు అంటున్నారని.. ఏ కేసులోనైనా ఆధారాలు ఉన్నాయా అంటూ భువనేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి అయిదేళ్లపాటు చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని.. ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా పనిచేసేవారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి గురించి ఏ మాత్రం ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేయీ.. చేయీ కలిపి పోరాడుదాం: పుంగనూరులో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తపై దాడి చేశారని.. ఎన్నాళ్లు ఈ దారుణాలని మండిపడ్డారు. అందరం చేయీ.. చేయీ కలిపి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ పోరాటాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని అన్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారన్న భువనేశ్వరి.. అయినా, ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు.
Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: ప్రజల్లోకి భువనేశ్వరి.. నేటి నుంచి 'నిజం గెలవాలి' యాత్ర
చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరు: ఎన్నికల ముందు అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తే.. టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారని.. కానీ, చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలు ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారని గుర్తు చేసుకున్నారు.
వారి ఆటలు ఇక సాగవు: చంద్రబాబుపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని.. ఆయన కష్టాన్ని ప్రజలు ఎవరూ మరిచిపోలేదని.. కేసులు, జైలు పేరు చెప్పి టీడీపీ శ్రేణులను బెదిరిస్తున్నారని అన్నారు. ఇక వారి ఆటలు సాగవని భువనేశ్వరి హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి గురించి ఏ మాత్రం ధ్యాసలేదన్న భువనేశ్వరి.. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా అరాచకమే రాజ్యమేలుతోందని.. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు.
ఎన్ని కష్టాలు వచ్చినా అడుగు ముందుకే వేద్దాం: రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్బంధించారన్న భువనేశ్వరి.. తెలుగువారి పౌరుషం అంటే ఏంటో ఎన్టీఆర్ చెప్పారని.. ఎన్ని కష్టాలు వచ్చినా అడుగు ముందుకే వేద్దామని పిలుపునిచ్చారు. ఇవాళ కాకుంటే రేపు అయినా నిజం గెలుస్తుందన్న భువనేశ్వరి.. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి.. సత్యమేవ జయతే అంటూ టీడీపీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.