Namo Bharat Train : దేశంలో సరికొత్త హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్' పేరుతో ప్రాంతీయ రైళ్లను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైళ్లకు 'నమో భారత్'గా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసినట్లు తెలుస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తర్వాత భారత్‌లో పట్టాలెక్కుతున్న మరో హైస్పీడ్ రైలు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి ప్రాంతీయ హైస్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (అక్టోబర్ 20న) ప్రారంభించనున్నారు. దిల్లీ నుంచి గాజియాబాద్ మధ్య ఈ రైలు నడవనుంది. సాహిబాబాద్- దుహై డిపో మధ్య ఈ రైలు దూసుకెళ్లనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో అధునాతన వసతులు ఏర్పాటు చేశారు.
కాగా, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో భాగంగా దిల్లీ- గాజియాబాద్ - మేరఠ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీంతో సాహిబాబాద్, దుహై డిపోల మధ్య 17 కిలోమీటర్ల పొడవైన కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ రెండు డిపోల మధ్య ఐదు స్టేషన్లు (సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్దర్, దుహై, దుహై డిపో) ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21 నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు సర్వీసులు అందిస్తాయి.
15 నిమిషాలకో రైలు..
నమో భారత్ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్. ఇరువైపులా 2x2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్‌లు ఉంటాయి. సీసీటీవీలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ మెకానిజం, ఛార్జింగ్ పాయింట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు నడుస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున సర్వీసులు అందిస్తాయి.
మహిళలకు రిజర్వు
ప్రతి ట్రైన్లో ఆరు కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించే వీలు ఉంటుంది. స్టాండర్డ్ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి. స్టాండర్డ్ కోచ్‌లలో కనీస టికెట్ ధర రూ.20 కాగా.. గరిష్ఠ ధర రూ.50గా నిర్ణయించారు. ప్రీమియం కోచ్‌లలో కనీస టికెట్ ధర రూ.40 కాగా.. గరిష్ఠ ధర రూ.100. ప్రతి ట్రైన్లో ఒక కోచ్‌ను మహిళల కోసం రిజర్వు చేశారు. ప్రతి కోచ్‌లోనూ మహిళలు, ప్రత్యేక అవసరాలు కలిగినవారు, సీనియర్ సిటిజన్లకు సీట్లను రిజర్వు చేశారు.
కాంగ్రెస్ విమర్శలు
అయితే, రైళ్లకు 'నమో భారత్' అని పేరు పెట్టడంపై మండిపడింది. స్వీయ వ్యామోహం విషయంలో మోదీకి హద్దు లేకుండా పోయిందని ధ్వజమెత్తింది. 'నమో స్టేడియం తర్వాత ఇప్పుడు 'నమో' రైళ్లు తీసుకొచ్చారు' అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు. గుజరాత్‌లోని మొటేరా స్టేడియానికి నరేంద్ర మోదీ అని పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, దేశం పేరునే మార్చేస్తే సరిపోతుంది కదా అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఎద్దేవా చేశారు. 'రైళ్ల పేరులో ఇంకా భారత్ అని పెట్టడం ఎందుకు? దేశం పేరునే నమోగా మార్చేస్తే సరిపోతుంది కదా?' అని ఖేడా ట్వీట్ చేశారు.
IRCTC Zomato Tie Up : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ట్రైన్‌లోనూ జొమాటో ఫుడ్ డెలివరీ షురూ!