మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అమానుష ఘటన జరిగింది. బిడ్డ కోసమని ఓ యువతిని బంధించి 16 నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. చివరకు శిశువు జన్మించాక బాధితురాలిని ఈనెల 6న దేవాస్ బస్టాప్ దగ్గర పడేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం..
నిందితులు రాజ్‌పాల్ సింగ్, చంద్రకాంత దంపతులు.. తమకు పుట్టిన ఇద్దరు పిల్లలను కోల్పోయారు. దీంతో సంతానం పొందాలని భావించిన ఆ జంట.. 16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఓ మహిళ వద్ద నుంచి బాధితురాలిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బాధితురాలిని వీరి ఇంట్లో బందీగా ఉంచి రాజ్‌పాల్ సింగ్ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన యువతి.. గత నెల 25న శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలు ఈనెల 6న ఆపస్మారక స్థితిలో ఉండగా దేవాస్ బస్‌స్టాప్ వద్ద పడేసి పరారయ్యాడు.
స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం రాజ్‌పాల్ దంపతులు సహా వారి బంధువైన వీరేంద్ర, కృష్ణపాల్, అర్జున్‌పై కేసు నమోదు చేశారు.
మానవ అక్రమ రవాణాకు కూడా పాల్పడినట్లు కేసులో పేర్కొన్న పోలీసులు.. బాధితురాలిని విక్రయించిన వారి వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజ్‌పాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి : నిధి కోసం పూజలు.. మహిళను వివస్త్రను చేసి..