కరోనా సంక్షోభం, లాక్డౌన్ ఆంక్షలతో పూట భోజనం అందక కొంతమంది అలమటిస్తున్నారు. ఇక జంతువుల పరిస్థితి మరీ దయనీయం. ఇలాంటి తరుణంలో వీధి శునకాలకు రోజూ రుచికరమైన చికెన్ బిర్యానీ అందిస్తున్నారు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన రంజీత్ నాథ్. మహమ్మారి మొదలైననాటి నుంచి సుమారు 190 వీధి కుక్కలకు ప్రతి రోజూ 40 కిలోల బిర్యానీ అందిస్తున్నారు రంజీత్.
బిర్యానీ తయారీకి ఏర్పాట్లు చేసుకుంటూ రంజీత్ తన దినచర్య ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సమయంలో వండి, సాయంత్రానికి శునకాలకు అందిస్తారు. ఇదంతా తన సొంత డబ్బులతో చేస్తున్నానని రంజీత్ చెబుతున్నారు. గత నెల నుంచి కొందరు దాతలు సహాయం అందిస్తున్నారని తెలిపారు.
"నాకు పని ఉన్న రోజుల్లోనూ శునకాలకు 30-40 కిలోల బిర్యానీ సిద్ధం చేస్తా. అది నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఓ 10-12 కచ్చితమైన ప్రాంతాలున్నాయి. అవి వాటికి తెలుసు. నన్ను చూడగానే నావైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. వీధిలోకి వచ్చాక.. కుక్కలకు మాత్రమే కాదు.. పిల్లులు వంటి వాటికి కూడా ఆహారాన్ని అందిస్తా."
- రంజిత్ నాథ్
ఈ శునకాలు తన పిల్లల్లాంటివని... తాను బతికి ఉన్నంతవరకు వీటికి ఆహారం అందిస్తానని చెబుతున్నారు రంజీత్. వీధిలోకి వచ్చాక పిల్లులకు కూడా బిర్యానీ పెడుతున్నానని తెలిపారు.
ఇదీ చూడండి: పడగెత్తుతున్న విపత్తులు.. నష్టనివారణే తక్షణ కర్తవ్యం!