మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ 45 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంలో ఐదుగుర్ని చంపి.. అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని పచ్పోలి ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
అశోక్ మాటుకర్ అర్ధరాత్రి సమయంలో తన భార్య విజయ(40), కూతురు పారి (14), కుమారుడు సాహిల్ (12)లను ఇంట్లోనే గొంతు కోసి చంపాడు. అనంతరం 200 మీటర్ల దూరంలో ఉన్న తన అత్తమ్మ ఇంటికి వెళ్లి.. ఆమెను, మరదలు అమిషా బోబ్డే(21)ను కూడా గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని తానూ ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ ఫౌలారి వెల్లడించాడు.
డోర్ తెరవకపోయేసరికి..
ఉదయం 9 గంటలు అయినా.. మాటుకర్ ఇంటి డోర్ తెరవకపోయేసరికి ఇరుగుపొరుగువారు అనుమానపడ్డారు. అనంతరం కిటికీ నుంచి తొంగి చూశారు. దీంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించినట్లు పోలీసులు తెలిపారు.
మాటుకర్ దర్జీ పని చేసేవాడు. ఇంట్లో గొడవ కారణంగానే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: డబుల్ డెక్కర్ బస్సు బోల్తా- 36 మందికి తీవ్రగాయాలు