Nagaland firing news: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగాలాండ్ కాల్పుల ఘటనపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మృతిలో ప్రమేయం ఉందంటూ సైన్యంలోని 21వ పారా ప్రత్యేక దళ సభ్యులపై సుమోటో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
"4వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో భద్రత దళాలతో పాటు పోలీసు గైడ్లు లేరు. అసలు భద్రతా దళాలు ఎవరికీ సమాచారం కూడా అందించలేదు. పౌరులను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే భద్రతా బలగాలు ఈ ఘటనకు పాల్పడినట్టు దీని ద్వారా అర్థమవుతోంది. నేరస్థులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాలి."
--- ఎఫ్ఐఆర్
ఓటింగ్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం సైన్యం ఆపరేషన్ చేపట్టింది. 21 కమాండోలు రంగంలోకి దిగి.. ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆదేశాలిచ్చినా.. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడం వల్ల కమాండోలకు అనుమానం మరింత పెరిగింది. చివరికి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సమాచారం అందుకున్న స్థానికులు.. సైనిక శిబిరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ జవాను మరణించాడు. పలువురు గాయపడ్డారు. ప్రజలను చెదరగొట్టేందుకు.. భద్రతా దళాలు కాల్పులు జరపక తప్పలేదు. ఫలితంగా మరో ఏడుగురు పౌరులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
మృతుల సంఖ్య ఎంత?
Nagaland firing incident death toll: ఘటన జరిగిన మోన్ పట్టణంలో సెక్షన్ 144న కొనసాగుతోంది. అయితే మృతుల సంఖ్య సందిగ్ధx నెలకొంది. కాల్పుల ఘటనలో 17మంది మరణించారని గిరిజనుల సంఘం కోన్యాంక్ యూనియన్ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత దానిని 14కు సవరించింది. శని, ఆదివారాల్లో జరిగిన వేరువేరు ఘటనల్లో 14మంది పౌరులు మరణించారని పోలీసులు చెబుతున్నారు.
మొత్తం మీద 28మంది గాయపడ్డారని.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
నాగాలాండ్‌లో నిరసనలు
కాల్పుల ఘటనపై నాగాలాండ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. అనేక దుకాణాలు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించింది. ఐదు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ప్రజలు ఎలాంటి ఉత్సవాల్లో పాల్గొనకూడదని పిలుపునిచ్చారు.
షా ప్రకటన..
నాగాలాండ్ కాల్పుల ఘటన సెగ పార్లమెంట్‌ను తాకింది. ప్రభుత్వం స్పందించాలని విపక్షాలు నిరసనకు దిగాయి. ఈ క్రమంలో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది.
Amit shah statement on Nagaland fire incident: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈ అంశంపై మధ్యాహ్నం ప్రకటన చేశారు. శని, ఆదివారాల్లో జరిగిన ఘటనలను వివరించారు. ఈ వ్యవహారంపై సిట్‌ను ఏర్పాటు చేసినట్టు, నెల రోజుల్లో దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించినట్టు స్పష్టం చేశారు. పౌరుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి:- నాగాలాండ్ ఘటనపై సైన్యం ప్రత్యేక దర్యాప్తు