కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలు కఠినతరం చేశాయి. ఈ క్రమంలో దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. అయితే.. దీని వల్ల కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తికి పెద్ద సమస్యే వచ్చిపడింది. దీంతో.. 'నా లోదుస్తులకు చిల్లులు పడ్డాయి.. దుకాణాలు తెరిపించండి' అంటూ చమరాజపురానికి చెందిన కేఎస్ నరసింహ మూర్తి ఏకంగా సీఎంకు లేఖ రాశాడు.
లెటర్ టు ఎడిటర్..
"నా వినతి కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం. నాకు రెండు బనియన్లు, రెండు అండర్వేర్లు ఉన్నాయి. వాటికి పూర్తిగా చిల్లులు పడిపోయాయి. లాక్డౌన్ ఆంక్షలు కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం వారానికోసారైనా దుకాణాలు తెరిచేలా చూడండి. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ప్రజల అవసరాలపై దృష్టి సారించాలి" అని ఓ స్థానిక వార్త పత్రికకు లేఖ రాశాడు నరసింహ మూర్తి. దీన్ని సోషల్ మీడియాలోను పోస్ట్ చేశాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎంను కోరాడు.
ఇదీ చదవండి:బెంచ్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. చివరికి!