ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్ 'మై గవర్నమెంట్'పై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజా భాగస్వామ్య పాలనకు సరైన ఉదాహరణగా, యువతకు ప్రశ్నించే గొంతుకను ఇవ్వటంలో శిఖరాగ్రాన నిలిచిందని కొనియాడారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తూ సూచనలు చేసిన వలంటీర్లు, కంట్రిబ్యూటర్లను ప్రశంసించారు మోదీ.
మై గవర్నమెంట్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. 2014లో ఎన్డీఏ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చాక ఈ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది మైగవర్నమెంట్ ఇండియా పోర్టల్. 'ఏడేళ్ల ప్రయాణాన్ని అత్యంత విలువైనదిగా మార్చిన మైగ వర్నమెంట్ సభ్యులకు కృతజ్ఞతలు. మైగవ్.ఇన్ ప్లాట్‌ఫామ్ ద్వారా మీ విలువైన సూచనలు అందించినందుకూ కృతజ్ఞతలు' అని పేర్కొంది.
జులై 29 జాతినుద్దేశించిన మోదీ ప్రసంగం
జాతీయ నూతన విద్యా విధానం(ఎన్ఈపీ) అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న క్రమంలో జులై 29న జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
"ఎన్ఈపీ-2020, అభ్యాస విధానాన్ని మార్చటం, విద్యను సమగ్రంగా అందించటం, ఆత్మనిర్భర భారత్‌కు బలమైన పునాదులు వేసేందుకు మార్గదర్శకంగా మారింది. సంస్కరణలు చేపట్టి ఏడాది కావస్తున్నందున జులై 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు."
- ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యా శాఖ మంత్రి.
నూతన విద్యావిధానం అమలులోకి వచ్చిన తర్వాత పురోగతి, విద్యావ్యవస్థలో కొత్త ప్రాజెక్టులు, వాటి కాలవ్యవధి వంటి విషయాలపై ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: లోక్‌సభ సీట్లు త్వరలోనే 1000కి పెంపు- నిజమెంత?